తెలంగాణ రాజకీయాల్లో ఈటెల రాజేందర్ వ్యవహారం వేడి మంటలు పుట్టిస్తోంది.ముఖ్యంగా అధికార పార్టీ టిఆర్ఎస్ లో ప్రకంపనాలు లేపుతోంది.
ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ తో నడిచిన ఈటెల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు రావడం, రెండు రోజుల్లోనే దీనికి సంబంధించిన పూర్తి విచారణ జరగడం , ఆయన అక్రమాలకు పాల్పడ్డారని టిఆర్ఎస్ ప్రభుత్వం తేల్చడం , ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం ఇలా ఎన్నో అంశాలు శర వేగంగా జరిగిపోయాయి.అయితే ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరిగిందని ఈటెల రాజేందర్ చెబుతున్నారు .ప్రభుత్వం తనపై కక్ష కట్టిందని విషయాన్ని ఆయన తన మాటల ద్వారా వ్యక్తం చేస్తున్నారు. బిజెపి , కాంగ్రెస్ తోపాటు టిఆర్ఎస్ వ్యతిరేక పార్టీలన్నీ ఈటెల రాజేందర్ కు మద్దతుగా మాట్లాడుతున్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా ఈటెల రాజేందర్ కు సానుభూతి బాగా పెరిగినట్లు కనిపిస్తోంది .అలాగే టిఆర్ఎస్ లో ఉద్యమ కాలం నుంచి ఉన్న నాయకులలోనూ ఆందోళన కనిపిస్తోంది.తమ పరిస్థితి ఎలా ఉంటుందనే బెంగ వారిలో ఎక్కువ అయింది.ఇది ఇలా ఉంటే తనపై వచ్చిన ఆరోపణలను పట్టించుకోనట్టు గా వదిలేస్తే , జనాల్లోకి ఆ విషయం వెళ్ళిపోతుందని ఈటెల రాజేందర్ భావిస్తున్నారు.
అందుకే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ అదే హుజురాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలవాలని ఆయన భావిస్తున్నారట .ఆయన కనుక రాజీనామా చేస్తే మిగతా రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను పోటీకి దించకుండా, రాజేందర్ కు సహకరించి టీఆర్ఎస్ పై ఈటెల అస్త్రాన్ని ఉపయోగించాలని వ్యూహం పన్నినట్లు సమాచారం.ఆయనపై వచ్చిన ఆరోపణలు అన్ని టిఆర్ఎస్ ప్రభుత్వ కుట్రేనని , పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ఈటెల హవా పెరగకుండా ఈ విధంగా ఆయనను తప్పించేందుకు వ్యూహం పన్నారు అనే విషయాన్ని టీఆర్ఎస్ రాజకీయ ప్రత్యర్థులు హైలైట్ చేస్తున్నారు.

అయితే రాజేందర్ సైతం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మళ్లీ ఇక్కడి నుంచి గెలవడం ద్వారా, జనాల్లో తనకు ఎంతమేర పట్టు ఉందనే విషయాన్ని టిఆర్ఎస్ కు తెలిసేలా చేయాలని, అప్పుడు సొంత పార్టీ పెట్టడమా లేక ఏదైనా బలమైన పార్టీలో చేరడమా అనే విషయంపై ఆలోచించాలనే అభిప్రాయం లో ఉన్నారట.ఎలా చూసుకున్నా ప్రస్తుతం టీఆర్ఎస్ కు ఒకవైపు ప్రజావ్యతిరేకత పెరిగి ఇబ్బంది పడుతున్న సమయంలోనే ఆ ఇబ్బందులతో పాటు ఈటెల రాజేందర్ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తోంది.