కాణిపాకం దేవాలయంలో లక్ష మోదక లక్ష్మి గణపతి హోమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ శారదా పీఠం స్వరూపానంద సరస్వతి స్వామి ఐదవ తేదీ నుంచి కాణిపాకంలో ఉదయాస్తమాన సేవను మొదలుపెట్టారు.
ఈ సేవ టికెట్ ధర లక్ష రూపాయలుగా దేవాలయ అధికారులు, పాలకమండలి నిర్ణయించింది.ఆ తర్వాత చైర్మన్ గెస్ట్ హౌస్ లో ఉన్న స్వరూప నందేంద్ర సరస్వతి, స్వత్మ నందేంద్ర సరస్వతి వారిని దర్శించుకోవడానికి చాలా మంది రాజకీయ నేతలు వచ్చారు.
చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, తిరుపతి ఎంపీ గురుమూర్తి, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు, చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, కొంతమంది ప్రముఖులు స్వామివారిని మర్యాదపూర్వకంగా కలిసి, వారి ఆశీర్వాదం తీసుకున్నారు.కాణిపాకం దేవాలయానికి సంబంధించి పబ్లిక్ రిలేషన్ ఆఫీసును కూడా ప్రారంభించి, తర్వాత వినాయక స్వామి వారి మూల విరాట్టు దర్శించుకుని, యాగశాలలో జరుగుతున్న లక్ష మోదక లక్ష్మీ గణపతి హవనము కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.కాణిపాకం దేవాలయంలో జరుగుతున్న ప్రత్యేక హోమానికి మూడో రోజులో భాగంగా నేడు యాగశాలలో స్వరూపానందేంద్ర సరస్వతి,
స్వత్మ నందేంద్ర సరస్వతి సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యక్ష పూజలు చేసి పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రక్తంగా నిర్వహించారు.ఈఈ వెంకటనారాయణ, దేవాలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు, సిబ్బంది కూడా ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొన్నారు.ఆ తర్వాత విశాఖ శారదా పీఠం స్వరూప నందేంద్ర సరస్వతీ స్వామి వారు మీడియాతో మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రజలందరూ బాగుండాలనే ఉద్దేశంతో లక్ష మోదక లక్ష్మీ గణపతి వ్రత హవనము చేయడం వల్ల రాష్ట్రానికి మంచి జరుగుతుందని వెల్లడించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని కంపెనీలు వచ్చి 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు.