మన హిందూ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి కార్యక్రమంలో ఎన్నో ఆచారాలను పాటిస్తుంటారు.అయితే ప్రతి కార్యం వెనుక ఒక అర్థం దాగి ఉంటుంది.
అయితే ప్రస్తుతం పెళ్లిలో చాలా వరకు చేయాల్సిన కార్యక్రమాలను చేయకుండా కేవలం కొన్నిటికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు.బహుశా ఆచారాల గురించి తెలియకపోవడమో లేక అవన్నీ ఇప్పుడు అవసరం లేదని భావించడం వలనో కొన్ని ఆచారాలను పాటించడం లేదు.
అయితే పెళ్లి వేడుకలో మాంగల్య ధారణ అనంతరం వధూవరులిద్దరు తలంబ్రాలు పోసుకునే ఆచారం మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.అయితే ఈ విధంగా వధూవరులిద్దరు తలంబ్రాలు పోసుకోవడం వెనుక దాగి ఉన్న అర్థం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
తెలుగులో అక్షింతలను తలంబ్రాలు అనిపిలుస్తారు.
తలయందు పోయేబడే, ప్రాలుబియ్యం అని అర్థం.పూర్వం వధువును ఒక ధాన్యలక్ష్మిగా భావించేవారు.
ఈ తలంబ్రాల కార్యక్రమంలో బియ్యానికి ఒక ప్రాముఖ్యత ఉంది.ఓ వధువా! నీవు మా ఇంటికి వచ్చాక, మన ఇంట ధాన్యం ఇలా కుప్పతెప్పలుగా విరివిగా ఉండి, మన జీవనానికి’ ఆధారభూతమైన ధాన్యంతో మనం నిత్య సంపదలను కలిగి ఉండాలని చెబుతూ వరుడు వధువు తలపై తలంబ్రాలు పోస్తాడు.
తలంబ్రాలు పోయడానికి ముందుగా పురోహితులు వరుడు వధువు చేతులను దర్భతో తుడిచి, దోసిలిలో రెండు సార్లు బియ్యాన్ని పోసి ఆపై కొద్దిగా పాలను వేసి తలంబ్రాలను సిద్ధం చేస్తాడు.ఆ తరువాత ముందుగా తలంబ్రాలు వరుడు వధువు పై వేస్తాడు.
ఈ విధంగా ఒకరిపైఒకరు తలంబ్రాలు పోసుకోవడం ఆచారంగా వస్తోంది.ఈ తలంబ్రాలను పోసుకునేటప్పుడు పురోహితులు ఈ కన్య వంశాన్ని వృద్ధి చేయుగాక, శాంతి, సంతోషం, అభివృద్ధి అన్ని వీరికి కలగాలని మంత్రాలు చదువుతూ తలంబ్రాలను పోయిస్తారు.
తలంబ్రాల వెనుక ఉన్న అసలైన అర్థం పరమార్థం ఇదే నని పండితులు తెలియజేస్తున్నారు.