రాబోయే సార్వత్రిక ఎన్నికలను ఏపీ సీఎం జగన్ సీరియస్ గా తీసుకున్నారు.ప్రస్తుతం పార్టీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ప్రభుత్వం అన్ని రకాలుగా మేలు చేస్తున్న, ఆశించిన స్థాయిలో ఆదరణ రాకపోవడం జగన్ కు అసంతృప్తి కలిగిస్తుంది.దీనికితోడు పార్టీలోని గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడంతో, చాలా నియోజకవర్గాల్లో పార్టీ చాలావరకు డ్యామేజ్ అయ్యింది.
ప్రతి నియోజకవర్గంలోనూ గ్రూపు రాజకీయాల కారణంగా కేడర్ లో ఐక్యమత్యం లోపించింది.చాలాకాలంగా ఈ సమస్య ఉన్నా, ఎప్పటికప్పుడు జగన్ వాటిని సర్దుబాటు చేయకుండా, పార్టీ నాయకులకు ఈ వ్యవహారాలు అప్పగిస్తూ వచ్చేవారు.
అయినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో, నేరుగా తానే రంగంలోకి దిగాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ మేరకు ఈ ఏడాది పార్టీ ప్లీనరీ నిర్వహించాలని డిసైడ్ అయ్యారు.
ఈ సందర్భంగా పూర్తిగా పార్టీలో ప్రక్షాళన చేపట్టాలని జగన్ నిర్ణయించుకున్నారట. 2017 లో వైసిపి ప్లీనరీ జరిగింది.అప్పటి నుంచి అనేక కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది .అయితే ఈ ఏడాది జూలై లో పార్టీ ప్లీనరీ ని ఏర్పాటు చేసేందుకు జగన్ నిర్ణయించారు.ఈ సందర్భంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు , భారీగా ప్రక్షాళన చేపట్టాలని చూస్తున్నారట. ప్లీనరీ సమయం నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి కావడంతో పాటు, ఏపీ మంత్రి వర్గంలో పూర్తిగా మార్పుచేర్పులు చేపట్టేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.
అలాగే వైసిపి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సైతం ఈ ప్లీనరీ కి హాజరు కాబోతున్నారు.ఈ సందర్భంగా పార్టీని మళ్లీ అధికారంలోకి ఏ విధంగా తీసుకువెళ్లాలనే విషయంపై ప్రశాంత్ కిషోర్ సైతం కీలక సూచనలు చేయబోతున్నట్లు సమాచారం.ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందనే విషయంపై ప్రాథమికంగా ఐ ప్యాక్ టీమ్ ద్వారా జగన్ సర్వే చేయించారు.ఇవి కాకుండా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా అందిన నివేదికలు ఇలా అన్నిటినీ లెక్కల్లో కి తీసుకుని పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేసేందుకు సిద్ధమవుతున్నారు.