పురాతన కాలం నుంచి తులసి మొక్కకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది.అదేమిటంటే, విఘ్నేశ్వరుడు ఒకసారి గంగానది ఒడ్డున కూర్చుని తపస్సు చేస్తుంటాడు.
అదే సమయంలో తులసి అనే ఓ మహిళ అక్కడికి వచ్చి గణేషున్ని చూసి ముగ్దురాలవుతుంది.వెంటనే గణేషుని వద్దకు వెళ్లి తనను పెళ్లి చేసుకోమని అడుగుతుంది.
అయితే అందుకు వినాయకుడు నిరాకరిస్తాడు.వివాహం చేసుకుంటే తన తపస్సుకు భంగం కలుగుతుందని అంటాడు.
దీంతో తులసికి కోపం వచ్చి వినాయకుడికి శాపం పెడుతుంది.అతని వివాహం బలవంతంగా, ఇష్టం లేకుండా జరుగుతుందని తులసి అంటుంది.
ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన వినాయకుడు తులసికి శాపం పెడతాడు.ఒక రాక్షసుడితో ఆమె వివాహం జరుగుతుందని, అతని వల్ల అన్నీ కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, వినాయకుడు తులసికి శాపం పెడతాడు.

అయితే వెంటనే తులసి తన తప్పు తెలుసుకుని శాప విమోచనం చేయమని గణేషున్ని ప్రార్థిస్తుంది.కాగా గణేషుడు అప్పుడు ఏమంటాడంటే, శాపం విమోచనం చేయలేనని, కానీ వచ్చే జన్మలో తులసి మొక్కగా జన్మిస్తావని, ఆ మొక్క లేకుండా విష్ణువుకు పూజ జరగదని, అంతేకాకుండా దాంట్లో అనేక ఔషధ గుణాలు కూడా కలిగి ఉంటాయని వినాయకుడు తులసికి వరం ఇస్తాడు.అనంతరం తులసి శంకచూద అనే ఓ రాక్షసున్ని వివాహం చేసుకుంటుంది.కొద్ది రోజుల పాటు కష్టాలను అనుభవించి ఆమె మరణిస్తుంది.మళ్లీ తులసి మొక్క రూపంలో జన్మిస్తుంది.అప్పటి నుంచి తులసి మొక్క ఆకులను విష్ణు పూజకు ఉపయోగిస్తున్నారు.
ఇప్పుడు కూడా తులసి ఆకులు లేనిదే విష్ణు పూజ పూర్తి కాదని చెబుతారు.అంతేకాదు తులసి మొక్కలో ఉన్న ఔషధ గుణాల గురించి కూడా ఇప్పుడు మనందరికీ తెలుసు.
కాగా అంతటి పవిత్రమైన తులసిని వినాయకుడి పూజలో మాత్రం వాడరు.ఎందుకంటే వారిద్దరి మధ్య జరిగిన ఆ సంఘటనే అందుకు కారణమని పండితులు చెబుతారు.

హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కకు ఉన్న ప్రాధాన్యత గురించి అందరికీ తెలుసు.మహిళలు నిత్యం తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేసి అంతా మంచే జరగాలని కోరుకుంటారు.చనిపోతున్న వారి నోట్లో తులసి తీర్థం పోసినా, తులసి ఆకులను ఉంచినా వారి ఆత్మ నేరుగా వైకుంఠానికే పోతుందట.దీనికి తోడు తులసి మొక్క వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలే ఉన్నాయి.
తులసి ఆకులను పలు ఔషధాల తయారీలోనూ వాడుతారు.అయితే మీకు తెలుసా.? తులసి మొక్క హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మొక్కగా ఎందుకు మారిందో.? ఎందుకు ఆ మొక్కకు అన్ని ఔషధ గుణాలు ఉన్నాయో.? అదే తెలుసుకుందాం రండి.