ద్రాక్షారామం పంచారామాల్లో ఒకటిగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం.ద్రాక్షారామంలో భీమేశ్వరుడు కొలువై ఉండి భక్తులకు దర్శనమిస్తుంటాడు.
ఈ భీమేశ్వరాలయాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు.పురాణాల ప్రకారం భీమేశ్వరంలో ఉన్న స్వామివారిని సాక్షాత్తు ఆ సూర్యభగవానుడు అభిషేకించాడని పురాణాలు చెబుతున్నాయి.
సూర్య భగవానుడు ఆ విధంగా భీమేశ్వరునికి తొలి అభిషేకం చేయడం వెనుక ఓ పురాణ కథ దాగి ఉంది.అదే విధంగా ఇక్కడ వెలసిన గోదావరి నదికి సప్తగోదావరి అని పిలుస్తారు.
గోదావరికి సప్త గోదావరి అనే పేరు ఏ విధంగా వచ్చిందో ఇక్కడ తెలుసుకుందాం.
భీమేశ్వరంలో స్వయంభూగా వెలిసిన భీమేశ్వరుని అర్పించేందుకు సప్తర్షులు ఈ ప్రాంతానికి గోదావరిని తీసుకువచ్చారని చెబుతుంటారు.
ఈ విధంగా భీమేశ్వరాలయానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి జలాలతో భీమేశ్వరునికి అభిషేకం చేయాలని సప్తర్షులు భావించారు.అందుకు అనుకూలంగా గోదావరి నదిని తమ వెంట తీసుకు రావాలని వారు భావించడంతో తుల్యుడనే మునీశ్వరుడు గోదావరి జలాలను అక్కడికి తీసుకు వస్తే తన యజ్ఞానికి భగ్నం కలుగుతుందని భావించి సప్తర్షులను నిలువరిస్తాడు.
ఈ విధంగా వీరిరువురి మధ్య తగాదా మొదలవడంతో వేదవ్యాసుడు వీరికి చక్కని పరిష్కారాన్ని తెలియజేస్తాడు.

ఎంతో ప్రసిద్ధి చెందిన గోదావరి నది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ద్రాక్షారామానికి చేరుకొంటుందనీ, అక్కడ సప్త గోదావరి పేరుతో పుష్కరిణిగా అవతరిస్తుందని వేదవ్యాసుడు తెలియజేశాడు.ఆ విధంగా సప్తర్షులు భీమేశ్వరానికి చేరుకునే సమయానికి సరిగ్గా సప్త గోదావరి జలాలతో ఆ భీమేశ్వరునికి మొదటగా సూర్యుడు అభిషేకం చేశాడు.ఆ విధంగా ఆ భీమేశ్వరునికి మొదటగా అభిషేకం చేసిన క్యాతి సూర్యభగవానునికి దక్కిందని పురాణాలు చెబుతున్నాయి.
అదే విధంగా ఇక్కడ గోదావరిని సప్త గోదావరిగా భావించి, ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పెద్ద ఎత్తున గోదావరి జలాలకు పుష్కరాలు జరుగుతుంటాయి.