నవంబర్ నెలాఖరు వరకు పోడు భూముల సర్వే,గ్రామసభ పూర్తి చేయాలి

సూర్యాపేట జిల్లా:ఈ నెలాఖరు వరకు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా,ప్రజల సందేహాలు నివృత్తి చేస్తూ పోడు భూముల సర్వే పూర్తి చేసి,ప్రతి గ్రామం,డివిజన్,జిల్లా సభలు పూర్తి చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం పోడు భూముల సర్వే,ధరణి దరఖాస్తులు తదితర అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర సిఎస్ సోమేశ్ కుమార్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ఆమె మాట్లాడుతూ డిసెంబర్ నెల మొదటి వారంలో అర్హులైన వారికి ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు అందించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారని,దానికి అనుగుణంగా అన్ని పనులు పూర్తి కావాలన్నారు.

జిల్లాల్లో ఎట్టి పరిస్థితుల్లో నూతన అటవీ భూముల ఆక్రమణకు అనుమతించరాదని, అటవి శాఖ అధికారులు,రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.భవిష్యత్తులో అటవీ భూమి ఆక్రమణకు గురికాకుండా గ్రామ సభల్లో తీర్మానం చేయాలని సూచించారు.

సీఎం కేసీఆర్ నిర్దేశించిన లక్ష్యం మేరకు భూ సర్వే పనులు,గ్రామసభల నిర్వహణ పూర్తి కావాలని,దీని కోసం రాష్ట్ర సిఎస్ అటవీ శాఖ ఉన్నతాధికారులు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు.అనంతరం సిఎస్ సోమేష్ కుమార్ పోడు భూముల సర్వే ప్రక్రియ పురోగతిపై జిల్లాల వారీగా రివ్యూ నిర్వహించారు.

ధరణి టిఎం 33 మాడ్యులలో పెండింగ్ దరఖాస్తుల పురోగతిపై జిల్లాల వారీగా సమీక్షించారు.ధరణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సిఎస్ కలెక్టర్లను ఆదేశించారు.

Advertisement

అనంతరం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ యాక్ట్ 2007 పై సంక్షేమ కమిషనర్ దివ్య రివ్యూ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ మాట్లాడుతూ జిల్లాలో వచ్చిన 7,373 పోడు భూముల ధరఖస్తుల్లో ఇప్పటి వరకు 7,220 దరఖాస్తులు పరిశీలించామని,జిల్లాలో ఇంకా 153 పోడు భూముల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని,51 టీములు ఏర్పాటు చేసి పోడు భూముల సర్వే నిర్వహిస్తున్నామని,నవంబర్ 20 నాటికి సర్వే పూర్తి చేస్తామని,రేపటి నుండి గ్రామాలలో గ్రామసభలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావు,జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్,అటవీ శాఖ అధికారి వి.సతీష్ కుమార్,డి.ఎస్పీ నాగభూషణం, ఆర్.డి.ఓ.లు వెంక రెడ్డి,రాజేంద్రకుమార్,కిషోర్ కుమార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News