లఖీంపూర్‌ ఖేరీ హింస: రైతుల మరణంపై యూకే, కెనడాల్లోని సిక్కు ఎంపీల ఆగ్రహం

ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరీలో ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్రమంత్రి కాన్వాయ్ దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.

కేంద్రం తీరుపై ప్రతిపక్షాలు, రైతు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.

శాంతియుతంగా నిరసన చేస్తున్న అన్నదాతలను చంపుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో తొలి నుంచి కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులకు మద్ధతుగా నిలబడుతున్న కెనడాకు చెందిన ఎన్ఆర్ఐలు తాజా లఖీంపూర్ ఖేరీ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ప్రధానంగా పంజాబ్ సంతతికి చెందిన కెనడా ఎంపీలు ఈ ఘటనను ఖండించారు.ఈ సందర్భంగా ఎంపీ టిమ్ ఉప్పల్ ట్వీట్ చేశారు.

లఖింపూర్ ఖేరిలో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై దాడి జరగడం తీవ్ర విచారకరం.ఈ ఘటనలో నలుగురు రైతులు చనిపోయారని అనేక మంది గాయపడ్డారని తెలుసుకుని షాక్ అయ్యాను.

Advertisement

బాధ్యులైన వారికి న్యాయం జరగాలి’ అని ఉప్పల్‌ డిమాండ్ చేశారు.అటు యూకే ఎంపీ ప్రీత్ కౌర్ గిల్ సైతం ట్విట్టర్ ద్వారా ఈ ఘటనను ఖండించారు.

ఇది తీవ్ర ఆందోళన కలిగించే ఘటన .శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నలుగురు రైతుల మరణాలపై విచారణ జరగాలని ఆమె డిమాండ్ చేశారు.మరో కెనడా ఎంపీ రూబీ సహోటా సైతం ట్విట్టర్ ద్వారా స్పందించారు.

లఖింపూర్ ఖేరిలో నిరసన తెలుపుతున్న రైతులపై హింస గురించి తెలుసుకుని నేను చాలా బాధపడ్డాను.మరణించిన, గాయపడిన రైతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ఆమె ట్వీట్ చేశారు.

కాగా, ఆదివారం కేంద్రమంత్రి అజయ్ మిశ్రా, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రయాణిస్తున్న కాన్వాయ్ రోడ్డు పక్కనే ఆందోళన చేస్తున్న రైతులపైకి దూసుకెళ్లింది.ఈ ఘటనలో నలుగురు రైతులు- నక్షత్ర సింగ్(55),దల్జీత్ సింగ్(35),లావీప్రీత్ సింగ్(20),గుర్వేంద్ర సింగ్(18) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.నిరసనకారులపైకి దూసుకెళ్లిన వాహనాల్లో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ ఉన్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

పుష్ప2 హిట్టైనా నోరు మెదపని టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇంత కుళ్లు ఎందుకు?
వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !

నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన కేంద్ర మంత్రి కుమారుడిని అదుపులోకి తీసుకోవాలంటూ రైతులు ఆందోళనకు దిగారు.మరోవైపు తమ సహచరులు నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఆగ్రహించిన రైతులు… పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు.

Advertisement

కేంద్రమంత్రి కాన్వాయ్ వెంట కారులో ప్రయాణిస్తున్న నలుగురు బీజేపీ కార్యకర్తలను కిందకి లాగి కొట్టి చంపారు.ఇక, ఈ హింసాత్మక ఘటనలను కవర్ చేస్తుండగా ఓ వాహనం ఢీకొని ఒక పాత్రికేయుడు కూడా చనిపోయాడు.

మొత్తంగా తొమ్మిది మంది ఆదివారం నాటి ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.

తాజా వార్తలు