మన దేశంలో ఆ పరమశివునికి ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి.అటువంటి పురాతన, ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో వారణాసి కూడా ఒకటి అని చెప్పవచ్చు.
భారతదేశంలోని అతి ప్రాచీన నగరాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన వారణాసినీ హిందువులు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావిస్తారు.పురాణాల ప్రకారం దాదాపు 5000 సంవత్సరాల క్రితం సాక్షాత్తు ఆ పరమశివుడే ఈ వారణాసిని స్థాపించాడని తెలుస్తోంది.
ఈ ఆలయంలో కొలువై ఉన్న శివలింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఎంతో ప్రసిద్ధి చెందినది.సాక్షాత్తు ఆ పరమ శివుడే స్వయంగా ఇక్కడ కొలువై ఉన్నాడని ఇక్కడి ప్రజల విశ్వాసం.
వారణాసిలో ఉన్నటువంటి గంగానదిలో స్నానమాచరించడం వల్ల గతజన్మ పాపాలు సైతం తొలగిపోతాయని, పాపాల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం.అదేవిధంగా దక్షుడు యాగంలో ఆత్మార్పణం చేసిన పార్వతి దేవి చెవి పోగు ఈ వారణాసి ప్రాంతంలో పడటం వల్ల ఈ ప్రాంతం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.
ఈ విధంగా చెవిపోగు పడిన ప్రాంతంలోనే విశాలాక్షి అమ్మవారు కొలువై ఉన్నారు.

ఎంతో ప్రసిద్ధి చెందిన వారణాసిలోని గంగా నదిలో స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని దేశం నలుమూలల నుంచి పర్యాటకులు ఇక్కడికి తరలివస్తుంటారు.మన పురాణాల ప్రకారం మహాభారత యుద్ధంలో గెలిచిన తర్వాత కూడా పాండవులు పాప విముక్తి కోసం కాశీకి వచ్చారని తెలుస్తోంది.అదేవిధంగా వారణాసిలో చనిపోయినా, గంగానది తీరంలో దహన సంస్కారాలు నిర్వహించారు వారికి నరకలోకం నుంచి విముక్తి కలుగుతుందని భావిస్తారు.
ఈ విధంగా ఎంతో ప్రసిద్ధి చెందిన వారణాసి ఎటువంటి ప్రళయం వచ్చినా ఏ మాత్రం చెక్కుచెదరని చెబుతారు.సాక్షాత్తు ఆ పరమశివుడి వారణాసిని సృష్టించడం వల్ల ఎటువంటి ప్రళయాలు కానీ, విపత్తులు కానీ కాశీ నగరాన్ని నాశనం చేయలేవు.
కల్పాంతం తర్వాత ఈ యుగం అంతమై తర్వాత యుగం ప్రారంభమవుతుంది అయినప్పటికీ వారణాసిని ఆ పరమేశ్వరుడు సృష్టించడం వల్ల ఎటువంటి ప్రళయ సమయంలో కూడా నాశనం కాకుండా పరమేశ్వరుడు తన త్రిశూలం పై వారణాసి నగరం నిలబెడతాడని నమ్మకం.