మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించరా సారూ...?

నల్లగొండ జిల్లా: గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతు వేదికలు,స్మశాన వాటికలు, డంపింగ్ యార్డ్స్ తదితర గ్రామాభివృద్ధి పనుల కోసం తమ సొంత డబ్బులతో పాటు అప్పులు తెచ్చి పనులు చేపట్టినా గత ప్రభుత్వం వాటికి సంబంధించిన బిల్లులు చెల్లించలేదని,దీనితో రాష్ట్ర వ్యాప్తంగా రూ.1300 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని,మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు రాకపోవడంతో నానా అవస్థలు పడుతున్నామని మాజీలు మనోవేదనకు గురవుతున్నారు.

అప్పులు తీసుకొచ్చిన సర్పంచులు బిల్లులు రాకపోవడంతో వాటిని తిరిగి చెల్లించలేక, అప్పులవాళ్ళ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునే స్థితికి చేరుకున్నామని వాపోతున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల మాజీ సర్పంచులు పలువురు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటనలు సైతం ఉన్నాయని,అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో ఇంట్లో బంగారం అమ్మి తిరిగి చెల్లించిన సంఘటనలు కూడా ఉన్నాయని ఆవేదన చెందుతున్నారు.గత ప్రభుత్వం సర్పంచులను ఇబ్బందులకు గురి చేసిందని,కనీసం ప్రజా ప్రభుత్వమని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో నైనా తమ పెండింగ్ బిల్లులు వస్తాయని ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నామని, అయినా ఈ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పది నెలలు గడుస్తున్నా బిల్లుల చెల్లింపు విషయంలో ఎటువంటి ఆలోచనలు చేయడం లేదని,అప్పు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేసిన తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే పెండింగ్ బిల్లులను చెల్లించాలని మాజీ సర్పంచులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.రూ.1300 కోట్ల బకాయిలు పెండింగ్ ఉన్నాయని సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ అంటున్నారు.రైతు వేదికలు, స్మశాన వాటికలు,డంపింగ్ యార్డ్స్ లాంటి అభివృద్ధి పనుల కోసం అప్పులు తెచ్చి పనులు చేశామని, రూ.1300 కోట్లు పెండింగ్ బిల్లులు రావలిసి ఉందని,ఇదే విషయమై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి,గవర్నర్,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను కలిసి మా సమస్యను వినవించుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని వాపోతున్నారు.పెండింగ్ బిల్లులను చెల్లించాలని సెక్రటేరియట్ వద్ద ధర్నా చేస్తే సుమారు 3600 మాజీ సర్పంచులను రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బిల్లులు చెల్లించాలని,లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరిస్తున్నారు.

అండర్ 14 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రధానం
Advertisement

Latest Nalgonda News