కాంగ్రెస్ పార్టీవి 420 హామీలు: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా: తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగితే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయమనడం కాంగ్రెస్ కు సబబు కాదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.

శుక్రవారం ఆయన జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తే తమని ప్రశ్నించేవారు ఉండరనేదే వారి ఉద్దేశ్యంలా ఉందన్నారు.

తాము 420 గాళ్లమని వాళ్లకు వాళ్లే చెప్పుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉందని,వాళ్ల దొంగతనాన్ని వాళ్లే బయట పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ పరిపాలన గొప్పతనంపై ప్రజలలో చర్చ మొదలైందని,ఇది కేవలం ఆరంభం మాత్రమే అన్నారు.

పథకాల అమలుకు ప్రభుత్వం సమయం తీసుకుంటే తప్పులేదు కానీ,ప్రజలను ఎక్కువ కాలం మోసం చేయాలని చూస్తే సాధ్యం కాదన్నారు.తెలిసీ తెలియక ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీకి గుదిబండలా మారాయని, అధికారంలోకి వచ్చేది ఉందా సచ్చేది ఉందా అన్న రీతిలో ఎవరో రాసిచ్చిన హామీలను చదివి,అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు ఆ అయోమయంలోనే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని,ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీవి అమలుకు సాధ్యం కాని మ్యానిఫెస్టో అని చెప్పామని, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అక్షరాల 420 ఉన్నాయని,ఆ హామీలను ప్రజలకు చెప్పే బాధ్యత ప్రతిపక్షంగా మాపై ఉందన్నారు.

ఇప్పటికే కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయిందని ప్రజలు చర్చుకుంటున్నారని,గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్న కాంగ్రెస్ ఆ హామీని అటకెక్కించి,ప్రజల నుండి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారని,పైగా బిల్లు చెల్లించకపోతే వచ్చేనెల రెట్టింపు అవుతుందన్న రీతిలో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.పరిపాలన చేతకాకపోతే అనుభవజ్ఞుల సహాయం తీసుకొని ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

Advertisement
విద్యుత్ వైర్లు తగిలి గడ్డి లోడు దగ్ధం

Latest Suryapet News