వైన్స్ టెండర్స్ కి 15 రోజులు... గృహలక్ష్మికి మూడు రోజులేనా...?

సూర్యాపేట జిల్లా: రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం టెండర్లపై ఉన్న సోయి పేదల ఇండ్లపై లేదని,వైన్స్ టెండర్స్ కి 15 రోజులు గడువిచ్చి,పేదల ఇంటికి కేవలం మూడు రోజుల గడువు పెట్టడం అంటే ప్రజల్ని మోసం చేయడమేనని తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి ఉప్పుగండ్ల సరోజ ఆరోపించారు.

గురువారం కోదాడ పట్టణంలోని తన నివాసంలో మహిళలతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తుందని విమర్శించారు.

రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలు గత తొమ్మిదేళ్లుగా సొంత ఇంటి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారని, నేడు హడావుడిగా ప్రభుత్వం అన్ని ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోమనడం, అది కూడా మూడు రోజులే గడువు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.గృహలక్ష్మీ దరఖాస్తు గడువును ఈనెల 20 వరకు పొడిగించాలని డిమాండ్ చేశారు.

దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాల్లో తెలంగాణ రాష్ట్రమే నెంబర్ వన్ స్థానంలో ఉన్నదని,ఎందరో మద్యానికి బానిసై మధ్యలోనే తనువు చాలిస్తూ కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో మడగలం నరసమ్మ, లింగనబోయిన పల్లవి, ఎలిశెట్టి లక్ష్మీప్రసన్న, ఉమా,శైలజ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సన్ ప్రీత్ సింగ్...!
Advertisement

Latest Suryapet News