కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి మూలవిరాట్టును గడ్డం కింద ప్రతి రోజు పచ్చ కర్పూరంతో అలంకరిస్తారు.దీని వెనక ఒక కథ ఉంది.
రామానుజాచార్యులవారు తన శిష్యుడు అనంతాళ్వార్ను స్వామి వారి అలంకరణకు పుష్పనందన వనాన్ని పెంచాలని ఆదేశం ఇచ్చారు.ఈ వనం పెంచటంలో అనంతాళ్వార్ భార్య కూడా సహాయం చేస్తుంది.
ఆ సమయంలో ఆమె గర్భవతిగా ఉండుట వలన తవ్విన
మట్టిని గంపలోకి తీసుకువెళ్ళుతూ అలసిపోయి కింద పడిపోతుంది.

ఆమెను చూసిన శ్రీనివాసుడు బాలుడు రూపంలో వచ్చి అనంతాళ్వార్ భార్యకు
సహాయం చేస్తాడు.అయితే దైవకార్యంలో ఇతరులు ఎవరు పాలు పంచుకోకూడని
భావించిన అనంతాళ్వార్ తన భార్యకు సాయం చేసిన బాలుడిని కొడతాడు.గడ్డంపై
దెబ్బ తగలడంతో ఆ బాలుడు అదృశ్యమైపోతాడు.
ఆ తర్వాత అనంతాళ్వార్ ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించుకుంటాడు.ఆ సమయంలో స్వామి గడ్డం నుండి రక్తం కారటాన్ని గమనించి ఆ బాలుడు శ్రీహరి అని గ్రహించి రక్తం కారకుండా పచ్చ కర్పూరాన్ని పెడతాడు.
అందుకే నేటికీ మూలవిరాట్ గడ్డం కింద పచ్చకర్పూరం పెడుతున్నారు.