విశిష్టాద్వైతాన్ని 11వ శతాబ్దంలో రామానుజాచార్యుడు ప్రతిపాదించారు.ఇదొక వేదాంత దర్శనం.
సాకారుడైన నారాయణుడు పరబ్రహ్మమైన భగవంతుడు అని ఈ తత్వము విశిష్టాద్వైతం ప్రతిపాదించింది.నిత్యానపాయినియై, నారాయణునితో ఎప్పుడూ కలిసి ఉండే లక్ష్మీ దేవికి వారిచ్చిన ప్రాధాన్యత వల్ల విశిష్టాద్వైతాన్ని శ్రీ వైష్ణవమని కూడా అంటారు.
విశిష్టాద్వైతం లేదా శ్రీ వైష్ణవం ప్రకారం దేవుడు ఒక్కడే.అతడు నారాయణుడు.
అతడే సాకారుడు.నిర్మల జ్ఞానానంద స్వరూపుడు ఆ భగవంతుడే.
ఆ దేవ దేవుడు ఒక్కడే ఎప్పటికీ స్వతంత్రుడు. జీవి, ప్రకృతి పరతంత్రులు అని విశిష్టాద్వైతం చెబుతోంది.
జీవాత్మ పరమాత్మ సన్నిధిని చేరడమే మోక్షం.మోక్షానికి సాధనం దృఢమైన విష్ణు భక్తి.
భక్తితో పాటు ప్రపత్తి అత్యంత అవసరం.మానవులందరూ సమానం అని మోక్షం పొందేందుకు అందరూ అర్హులేనని విశిష్టాద్వైతం చెబుతున్న ముఖ్యమైన అంశం.
కుల లింగ వివక్ష లేకుండా లక్ష్మీ నారాయణులను పూజించి చక్రాంకితాలు చేయించుకుని, మంత్రోపదేశం పొంది ఊర్ధ్వపుండ్ర ధారణ చేసిన వారందరూ శ్రీ వైష్ణవులేనని విశిష్టాద్వైతం చెబుతోంది.ఈ సిద్ధాంతం ప్రకారం జీవాత్మ, పదార్థం అనేవి రెండూ, పరమాత్మ ఆధారంగా మనుగడ సాగించేవే కానీ, పరమాత్మలో కలిసి పోయేవి ఎంత మాత్రం కావు.అలాగే పరమాత్మను చేరుకున్న ఆత్మలన్నీ సర్వ వ్యాపకత్వం, సృజన శక్తి అనే రెండు లక్షణాలను తప్ప, భగవంతునికి మిగిలిన లక్షణాలన్నింటినీ కలిగి ఉంటాయి.ముక్తి పొందడానికి అద్వైతం జ్ఞాన మార్గాన్ని ప్రధానంగా చెబితే… త్రికరణ శుద్ధి కలిగిన భక్తి మార్గాన్ని విశిష్టాద్వైతం చెబుతోంది.