జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని , కేంద్రంలో బిజెపి కి తామే ప్రత్యామ్నాయం కావాలనే ఏకైక లక్ష్యంతో బి ఆర్ ఎస్ పార్టీని కేసిఆర్ ప్రారంభించారు.ఈ పార్టీలో టిఆర్ఎస్ పార్టీని సైతం కేసీఆర్ విలీనం చేసేశారు.బి.ఆర్.ఎస్ తరపున జాతీయ స్థాయిలో కమిటీలను , వివిధ రాష్ట్రాలకు అధ్యక్షులను నియమించే వ్యవహారాలపై కేసీఆర్ నిమగ్నమయ్యారు.ఇక ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు మొదలు పెట్టేందుకు కేసిఆర్ హడావుడి పడుతున్నారు.
కేంద్రంలో బిజెపికి సరైన రాజకీయ ప్రత్యామ్నాయం లేకపోవడంతోనే బిజెపి వరుసగా అధికారంలోకి రాగలుగుతుందని భావిస్తున్న కేసీఆర్ బిజెపి పై ప్రజలలోను తీవ్ర వ్యతిరేకత ఉందని, అది తమ పార్టీ ద్వారా ప్రజలు బిజెపిని గద్దె దించేందుకు ఉపయోగించుకుంటారని కేసీఆర్ పదే పదే చెబుతున్నారు.ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో కేసీఆర్ పర్యటించారు.
అక్కడ బిజెపి వ్యతిరేక పార్టీలు అన్నిటిని ఏకం చేసి, తమ పార్టీకి మద్దతు ఉండేలా చూసుకుంటున్నారు.అలాగే వివిధ రాష్ట్రాల్లోనూ జరగబోయే ఎన్నికల్లో అక్కడ బిజెపి వ్యతిరేక పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసేందుకు భారీగా ప్లాన్ వేస్తున్నారు.
అయితే ఇదంతా ఎంతవరకు కలిసి వస్తుందనేది సందేహంగా మారింది.
బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ సమయంలో చాలా రాష్ట్రాల లో ఉన్న ప్రాంతీయ పార్టీల అధినేతలకు కేసీఆర్ ఆహ్వానం పంపారు .బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో పాటు, అఖిలేష్ యాదవ్ , కుమారస్వామి, వామపక్ష నాయకులను ఆహ్వానించారు.అయితే కుమారస్వామి మినహా ఈ కార్యక్రమానికి ఎవరు హాజరు కాలేదు.

దీంతో రాబోయే రోజుల్లో కేసీఆర్ కు మద్దతు ఎంతవరకు ఉంటుందనేది సందేహంగా మారింది.ప్రస్తుతం గుజరాత్ ఎన్నికల్లో బిజెపి మరోసారి గెలవడం, దేశవ్యాప్తంగా బిజెపి గాలే ముందు ముందు వీచేలా కనిపిస్తుండడం, కేసీఆర్ పై ముందున్నంత నమ్మకం ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నేతలకు లేకపోవడం ఇవన్నీ వారు వెనుకడుగు వేసేలా చేస్తున్నాయనే ప్రచారం జరుగుతుంది.దీనికి తగ్గట్లుగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో కేసీఆర్ చేసిన ప్రసంగం కూడా అంతగా ఆకట్టుకోకపోవడం పైన చర్చ జరుగుతోంది.ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీని తమ భుజాలపై వేసుకుని మోసే బాధ్యతలను స్వీకరించేందుకు తెలంగాణ మినహా , మిగతా రాష్ట్రాల్లో ఆంత ఆసక్తి అయితే కనిపించడం లేదట.