రైతు వేదికలు మందు బాబులకు అడ్డాలు...!

నల్లగొండ జిల్లా:రాజుల సొమ్ము రాళ్ళ పాలు అన్న చందంగా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించిన రైతు వేదికలు నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని గుర్రంపోడు, పెద్దవూర,తిరుమలగిరి(సాగర్),అనుముల,త్రిపురారం,నిడమనూరు మండలాల్లో ఎలాంటి కార్యక్రమాలకు నోచుకోక నిరుపయోగంగా ఉన్నాయని,కొన్నిచోట్ల మందు బాబులకు అడ్డగా మారాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

గత ప్రభుత్వ హయంలో అన్నదాతలకు అవగాహన కల్పించడం కోసం రైతు వేదికలను నిర్మించిన విషయం తెలిసిందే.

ఆలోచన మంచిదే కానీ, ఆచరణలో కనిపించడం లేదని,వ్యవసాయ శాఖ అధికారులు క్రమం తప్పకుండా రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్న దాఖలాలు ఎక్కడా లేవని,ఒకవేళ రైతులు సమావేశాలు జరిగినా గ్రామ పంచాయతీ,రచ్చకట్ట,చెట్ల కింద నిర్వహించుకునే పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని వాపోతున్నారు.ఇదిలా ఉండగా వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, యాంత్రీకరణ,చీడ,పీడల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు,భూసార పరీక్షలతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు,రైతుబీమా,ఆయిల్‌ ఫాం సాగుతో పాటు ఇతర పంటలన్నింటిపై రైతులకు అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో రూ.22లక్షల నుంచి రూ.25లక్షలు వెచ్చించి రైతు వేదికలు నిర్మించారు.రైతు వేదికల నిర్వహణ కోసం ప్రతినెలా రూ.9వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో చాలాచోట్ల రైతు వేదికల నిర్వహణ కోసం కొన్నాళ్లుగా మెయింటెనెన్స్‌ నిధులు చెల్లించకపోవడంతో ఏఈవోలే నిర్వహణ భారం వెచ్చించాల్సి వస్తోంది.

ఆ నిర్వహణ కోసం చేసిన ఖర్చును బిల్లులు పెట్టుకుంటే ప్రభుత్వం నుంచి వస్తాయో,లేదో తెలియని పరిస్థితి నెలకొంది.రైతు వేదికల సద్వినియోగంపై ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని,మౌలిక వసతుల కల్పనతో పాటు నిర్వహణ ఖర్చులు,కిందిస్థాయి సిబ్బంది నియామకం చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

ఆదరిస్తానని నమ్మించి ఆస్తిని కాజేసిన కూతురు
Advertisement

Latest Suryapet News