రాజకీయాలలో ఓపిక అవసరం..చిల్లరగాళ్ళ చేష్టలకు స్పందించకండి:మాజీ మంత్రి తుమ్మల కామెంట్స్

త్వరలోనే మనకు మంచిరోజులు వస్తాయని,నేను మీ తోనే ఉంటా, మీ కష్ఠాలలో పాలు పంచుకుంటా అని కార్యకర్తలు,అనుచరులతో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు ఖమ్మం జిల్లా రూరల్ మండలంలో ఇటీవల అక్రమ కేసుల్లో జైలుకు వెళ్లొచ్చిన మాజీ కార్పొరేటర్ జంగం భాస్కర్ ని మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు.

ఈ సందర్భంగా అక్కడ ఉన్న అనుచరులు, కార్యకర్తలతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

మనతో ఉండేవారిని ఏవిధంగా ఇబ్బందులు పెడ్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారని, భవిష్యత్ కాలమే నిర్ణయిస్తుందని, రాజకీయాల్లో ఓపిక అవసరం అని చెప్పారు.పార్టీని బజారున పడేసే ఉద్దేశ్యం మనకు లేదని, ఎవ్వరు కవ్వించినా, బాధపెట్టినా, ఇబ్బంది పెట్టినా మీరు ప్రతిఘటించవద్దని, అలాంటి వ్యక్తులను పట్టించుకోవద్దన్నారు.

చిల్లర వ్యక్తుల చిల్లర పనులను పట్టించుకుంటే మన పరువు ప్రతిష్ఠలే దిగజారతాయని అన్నారు.భగవంతుని దయతో జిల్లా సమగ్రాభివృద్ది చేసానని, నేను పదవి లో ఉండగా ఏనాడుప్రతిపక్ష పార్టీలకు సంబందించిన వారిపై కూడా వివక్ష, కక్ష పురితంగా వ్యవహారించలేదని, వారిని కేసులతో ఇబ్బంది పెట్టలేదని గుర్తు చేశారు.

కాని ఇప్పుడు సొంత పార్టీ లోని వాళ్ళనే ఇలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కక్ష, వివక్ష పూరిత విధానం వారి విజ్ఞతకే వదిలేద్దాం అని అన్నారు.

Advertisement

అలాంటి వ్యక్తుల పై పార్టీ ఆదేశాలు ఎలా ఉంటాయో చూద్దామని, ఓపిక పట్టాలని అన్నారు.ఇక ముందు కూడా ప్రజల బాగోగులు, అభివృద్ది, మన ప్రాంత సర్వతోముఖాభివృద్దే మన అభిమతం కావాలని, ఆ దిశగానే నా పని తీరు ఉంటుందని తెలియజేసారు.

ఈ ఉగాది అందరి జీవితాలలో వెలుగులు నింపాలని అందరికీ శుభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Latest Khammam News