సూడో నక్సలైట్ మూఠా ఆట కట్టించిన నల్లగొండ జిల్లా పోలీసులు

నల్లగొండ జిల్లా:నలుగురు యువకులు జీవితంలో షార్ట్ కట్ లో స్థిరపడాలనే ఉద్దేశ్యంతో తుపాకులు కొనుగోలు చేసి,మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రోడ్లపై వెళ్ళేవారిని టార్గెట్ చేసి తుపాకులు చూపించి బెదిరించి,భయబ్రాంతులకు గురి చేసి డబ్బులు వసూల్ చేయడమే పని పెట్టుకున్న సూడో నక్సలైట్లుగా అవతారమెత్తిన ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపిన సంఘటన జిల్లాలో సంచలనం కలిగించింది.

జిల్లా ఎస్పీ చందనా దీప్తి మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.

గుడిపల్లి మండలం ఘణపురం గ్రామ శివారులోని పెద్దమ్మ తల్లి గుడిని శుభ్రం చేయడానికి వెళ్ళిన తోటకురి పెద్ద వెంకటయ్యకు గుడిలో ఒక మూలకు మూడు తుపాకులు కనిపించడంతో కంగారుపడి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గుడిలోని 3 తుపాకులను స్వాధీనం చేసుకొని, పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

దర్యాప్తులో భాగంగా గ్రామానికి చెందిన కొందరిని విచారణ చేస్తున్న క్రమంలో వారు చెప్పిన వివరాలను బట్టి ఘణపురం గ్రామానికి చెందిన తోటకూరి శేఖర్ తుపాకులను దాచాడనే అనుమానంతో అతని కోసం గాలిస్తుండగా గత నెల 16 న అంగడిపేటలో దొరికాడు.అదుపులోకి తీసుకుని విచారించగా తుపాకులు దాచింది తానేనని ఒప్పుకొని కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించాడు.

నిందితుడు తెలిపిన వివరాల ప్రకారం ఇతనిపై గతంలో హాలియా పోలీసు స్టేషన్లో అక్రమంగా తుపాకులు కలిగి ఉన్న నేరంపై జైలుకు వెళ్ళడం జరిగింది.మిర్యాలగూడ జైలులో అతనికి రమేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.

Advertisement

బయటికి వచ్చాక ఇద్దరూ కలిసి ఎలాగైనా తొందరగా జీవితంలో స్థిరపడాలని భావించారు.రమేశ్ కి తెలిసిన మహబూబాబాద్ జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ, శ్రీనివాసలు వీరికి జత కలిశారు.

నలుగురు కలిసి సూడో నక్సలైట్ ముఠాగా ఏర్పడ్డారు.తుపాకులు కొనుగోలు చేసి, ధనవంతులను,మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారులను, రోడ్డుపై వెళ్ళే వాహనాలను టార్గెట్ చేసి తుపాకులు చూపించి బెదిరించి డబ్బులు వసూలు చేసి,ఆర్థికంగా తొందరగా స్థిరపడాలని పథకం వేశారు.

పథకం అమలులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం దగ్గర గల జీకే వీధి సాపర్లలో తుపాకులు కొనుగోలు చేశారు.ఆ తుపాకులను కొన్ని రోజులు శేఖర్ తన ఇంట్లోనే ఉంచుకున్నాడు.

ఎవరైనా చూస్తారని భయపడి ఘణపురం గ్రామ చివర, జనసంచారం లేని పెద్దమ్మతల్లి గుడిలో భద్రపరిచాడు.ఈ తుపాకులు పెద్దవిగా ఉండడంతో వెంట తీసుకెళ్లడానికి కష్టంగా ఉండడంతో పిస్టల్ లాంటి చిన్న తుపాకులను ఉంటే సులువుగా కనపడకుండా పట్టుకెళ్ళవచ్చని,పిస్టల్ కొనుగోలు కోసం అన్వేషిస్తున్న క్రమంలోనే తేదీ 16 మే 2024 న అంగడిపేటలో శేఖర్ పట్టుబడ్డాడు.

వయస్సు పెరుగుతున్నా లుక్స్ విషయంలో అదుర్స్. చిరుకు మాత్రమే సాధ్యమంటూ?
రాగల నాలుగు రోజులు వర్షాలే...వర్షాలు..!

అతను ఇచ్చిన సమాచారంతో మిగతవారిని హైదరాబాదులో అదుపులోకి తీసుకుని వీరిపై క్రైమ్ నెంబర్ 77/2024 యు/ఎస్ సెక్షన్ 25 ఏఆర్ఎంఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.ఈ కేసు ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని, దర్యాప్తులో ఇంకేమైనా కొత్త విషయాలు తెలిస్తే వాటి ఆధారంగా కేసు యెక్క పురోగతి ఉంటుందని ఎస్పీ తెలిపారు.

Advertisement

ఏవరైనా ఇలాంటి అక్రమ ఆయుధాలు కలిగి ఉండడం నేరమని,వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కేసును చేధించుటకు దేవరకొండ డిఎస్పీ ఆధ్వర్యంలో కొండమల్లేపల్లి సిఐ కె.ధనుంజయ్,గుడిపల్లి ఎస్ఐ డి.నర్సింహులు,సిబ్బంది హేమానాయక్,సత్యనారాయణ,హట్టి నాయక్,కొండల్,భాస్కర్,మహేశ్,గురువారెడ్డి,లాలూ నాయక్ ప్రత్యేక బృందంగా ఏర్పడి కేసును త్వరగా ఛేదించినందుకు ఎస్పీ వారిని అభినందించారు.

Latest Nalgonda News