ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసిపి… తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ మధ్య చిగురించిన స్నేహం మరింత చిగురిస్తుందా లేక మధ్యలోనే వాడిపోతుందా అనే సందేహం ఇప్పుడు అందరిలో కలుగుతోంది.టిడిపి అధినేత చంద్రబాబు మీద ఉన్న కోపంతో కేసీఆర్ జగన్ తో దోస్తీ చేస్తున్నాడని అందరికీ తెలుసు .
అయితే కేసీఆర్ తో జగన్ స్నేహం చేయడం వైసీపీకి ఏ మాత్రం కలిసి వస్తుందనే సందేహాలు అందరిలోనూ కలుగుతున్నాయి.అయితే కేసీఆర్ మాత్రం చంద్రబాబు మీద కోపం ఒక్కటే కాకుండా కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు వ్యతిరేకంగా… ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటు చెయ్యడంతో అందులో జగన్ ను తీసుకొచ్చి మరింత బలపడాలని కేసీఆర్ భావిస్తున్నాడు.
దీనిలో భాగంగానే… జగన్ కు అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందించాలని చూస్తున్నాడు.

ఈ నేపథ్యంలోనే కేసీఆర్ అమరావతి టూర్ కూడా ఫిక్స్ అయ్యింది.ఇక్కడే చంద్రబాబు కి అందించే గిఫ్ట్ ను రెడీ చేసే పనిలో పడ్డాడు కేసీఆర్.వచ్చే నెల 14వ తేదీన అమరావతిలో వైఎస్ జగన్ గృహ ప్రవేశం జరగనుంది.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో స్థిరపడాలని భావించిన జగన్ అక్కడే సొంత ఇంటిని నిర్మించుకున్నారు.ఇల్లు,పార్టీ కార్యాలయం నిర్మాణాలు పూర్తి కావడంతో వచ్చే నెల 14వ తేదీన జగన్ గృహ ప్రవేశం చేయనున్నారు.
అయితే ఇటీవల ఫెడరల్ ఫ్రంట్ పై చర్చించేందుకు కేటీఆర్ జగన్ తో సమావేశమయిన సంగతి తెలిసిందే.ఏడాదిపాటు సక్సెస్ ఫుల్ గా పాదయాత్ర చేసినందుకు గాను కేసీఆర్ కూడా జగన్ ను అభినందించారు.ఈ సందర్భంగా కేసీఆర్ తాను త్వరలోనే విజయవాడ వచ్చి కలుస్తానని చెప్పారు.అయితే… జగన్ కూడా తన ఇంటి గృహప్రవేశం వచ్చే నెల 14వ తేదీన అమరావతిలో ఉండడంతో ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా కేసీఆర్ ను ఆహ్వానించారు.

అయితే జగన్ – కేసీఆర్ ల కలయికను టీడీపీ రాజకీయంగా ఉపయోగించుకునేట్టు కనిపించడంతో కేసీఆర్ ఆలోచనలోపడినట్టు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో కేసీఆర్ నేరుగా జగన్ గృహప్రవేశానికి రావడం సరైందా కాదా అనే చర్చ పార్టీలోనూ మొదలయ్యింది.పొరుగు రాష్ట్ర సీఎంను శుభకార్యానికి ఆహ్వానించడంలో ఎలాంటి తప్పులేదని కొందరు వాదిస్తున్నారు.పరిటాల శ్రీరామ్ వివాహానికి కేసీఆర్ రాలేదా? అని కొందరు వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.కానీ దీనిపై కేసీఆర్ కూడా పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.తన రాకతో జగన్ డ్యామేజీ కాకూడదని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
జగన్ మాత్రం వస్తే తప్పేంటనే ధోరణిలో ఉన్నారు.కేసీఆర్ మాత్రం ఈ నెల 14వ తేదీ కాకుండా 18వ తేదీన అమరావతికి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.