ఏపీలో మరోసారి సమ్మె సైరన్.. జగన్ సర్కారుకు ఇబ్బందేనా?

ఏపీలో మరోసారి సమ్మె సైరన్ మోగనుంది.కొన్ని నెలల కిందట పీఆర్సీలో అవకతవకలను నిరసిస్తూ ఉద్యోగులు సమ్మె బాట పట్టడంతో జగన్ సర్కారు చిక్కుల్లో పడింది.

ఉద్యోగులందరూ విజయవాడలో పెద్ద ఎత్తున ధర్నా చేయడంతో ప్రభుత్వం దిగి వచ్చింది.ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరిపింది.

అయితే ఇప్పుడు మున్సిపల్ శాఖ ఉద్యోగులు సమ్మె చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.మున్సిపల్‌ కార్మికులు, ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వచ్చే నెల 11 నుంచి నిరవధిక సమ్మె చేపట్టాలని నిర్ణయించినట్లు మున్సిపల్ కార్మికులు, ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించింది.ముఖ్యంగా జీతభత్యాల చెల్లింపుల్లోనూ ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ వర్తింపులో కూడా జాప్యం జరుగుతోందని మున్సిపల్ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.2019 ఆగస్టు నుంచి మున్సిపల్ కార్మికులకు ఇస్తున్న ఆక్యుపేషనల్ అలవెన్సును నిలిపివేయడం సరికాదని ఆరోపిస్తున్నారు.ఆరోగ్య భత్యం బకాయిల చెల్లింపుతో పాటు ఇంజినీరింగ్‌ కార్మికులు సహా అందరికీ ఆరోగ్య భత్యం చెల్లించాలని మున్సిపల్ కార్మికులు, ఉద్యోగ సంఘాల జేఏసీ కన్వీనర్‌ కె.ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు.అదేవిధంగా పాత బకాయిల చెల్లింపునకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత బీమా లేకుండా ఉద్యోగాలు చేయడం కష్టమేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.ఏపీలో ఇటీవల కొన్ని పంచాయతీల విలీనం తరువాత మున్సిపల్, పారిశుధ్య కార్మికుల వేతనాల చెల్లింపు కూడా సజావుగా సాగడం లేదు.

Advertisement

శివారు పంచాయతీల విలీనానికి ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో ఇక్కడి సమస్యలు ముఖ్యంగా ఉద్యోగ కార్మిక వర్గాల సమస్యలు జీతభత్యాల చెల్లింపు వంటి విషయాలను జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ప్రతినెల జీతాల చెల్లింపుల్లో జాప్యం కారణంగా తామంతా పస్తులుండి కుటుంబాలను నెట్టుకురావాల్సి వస్తోందని ఉద్యోగులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ తీరుకు నిరసనగా జూలై 11 నుంచి సమ్మె చేపడతామని హెచ్చరిస్తున్నారు.ఒకవేళ మున్సిపల్, పారిశుధ్య ఉద్యోగులు సమ్మె చేపడితే జగన్ సర్కారు ఇబ్బందేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు