సాధారణంగా మనం ఏదైనా శివాలయాలను దర్శించినపుడు అక్కడ మనకు శివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు.కొన్ని ఆలయాలలో మాత్రమే శివుడు విగ్రహ రూపంలో దర్శనమిస్తారు.
ఈ విధంగా మనం శివుడిని విగ్రహరూపంలో లేదా లింగ రూపంలో దర్శించుకోవడం సర్వసాధారణమే.కానీ ఈ ఆలయంలో మాత్రం శివలింగానికి బదులుగా శివుడు బొటన వేలితో భక్తులకు దర్శనం కల్పిస్తున్నాడు.
వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ ఆలయంలో స్వామి మాత్రం బొటనవేలితో భక్తులకు దర్శనం కల్పిస్తున్నాడు.ఇంత ఆశ్చర్యకరమైన ఆలయం ఎక్కడ ఉంది? ఆలయ విశిష్టతలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
రాజస్థాన్ రాష్ట్రం, మౌంట్ అబూకి దగ్గరలో అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉంది.ఈ ఆలయంలో వెలసిన శివుడిని అచలేశ్వరుడు అని పిలుస్తారు. అన్ని శివాలయాలకు భిన్నంగా ఈ ఆలయంలో మనకు శివలింగం కనిపించదు.ఈ ఆలయ గర్భగుడిలో ఒక వలయాకారంలో ఒక సొరంగం ఉంటుంది.
ఆ సొరంగంలో మన చేతికి అందే అంత ఎత్తు వరకు నీరు ఉండగా ఆ నీరు పైభాగంలో మనకు కాలి బొటన వేలు ఆకారం ఉంటుంది.ఆ బ్రొటన వేలు శివుడి బొటనవేలు.
ఆలయానికి వచ్చే భక్తులు ఆ బొటన వేలుకు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తుంటారు.
పురాణాల ప్రకారం ఆరావళి పర్వతాలు ఎక్కడికి కదిలి పోకుండా ఉండటం కోసం ఆ పరమ శివుడు తన బొటన వేలితో గట్టిగా అదిమి పట్టాడని చలన లక్షణం ఉన్న పర్వతాలను కదలకుండా అంటే అచలనం చేశాడు కనుక ఈ ఆలయంలో వెలసిన స్వామి వారికి అచలేశ్వరుడు అని పేరు వచ్చినట్లు స్థలపురాణాలు చెబుతున్నాయి.ఇక ఆలయంలో పంచ లోహాలతో తయారు చేస్తున్న ఐదు టన్నుల బరువైన నంది విగ్రహం, విగ్రహం పక్కనే ఓ పిల్లవాడు నిలబడి దర్శనమిస్తుంటారు.ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో పారమార రాజవంశస్థులు నిర్మించారు.
ఈ ఆలయానికి దగ్గరలో ఒక కొండ గుహ అనేది ఉంటుంది.ఈ గుహని గోపిచంద్ గుహ అని పిలుస్తారు.
ఇలా ఎన్నో విశేషాలు, వింతలు దాగి ఉన్న ఈ అచలేశ్వర్ మహదేవ్ ఆలయాన్ని దర్శించడం కోసం భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటారు.