పూర్తి కాలం కాదు తాత్కాలికమే: ఈ-సిగరెట్ల నిషేధంపై మాట తప్పిన ట్రంప్

యువతపై దుష్పరిణామాలతో పాటు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో ఫ్లేవర్డ్ ఈ-సిగరెట్లపై త్వరలో నిషేధం విధించనున్నట్లు అమెరికా ప్రభుత్వం గురువారం ప్రకటించింది.పొగాకు లేదా మెంతోల్ కాకుండా కాట్రిడ్జ్ (గుళిక) ఆధారిత ఈ సిగరెట్ల తయారీకి ప్రభుత్వం నుంచి అనుమతి లేకపోతే అమ్మకం/కొనుగోలు చట్టవిరుద్ధమని యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) ఒక ప్రకటనలో తెలిపింది.

30 రోజుల్లోపు ఇటువంటి గుళికల తయారీ, అమ్మకాలను నిలిపివేయని సంస్థలకు శిక్ష తప్పదని ఎఫ్‌డీఏ తెలిపింది.యువత ఈ-సిగరెట్ల వాడకం ప్రస్తుతం దేశంలో అంటువ్యాధిలా తయారైందని యూఎస్ ఆరోగ్య కార్యదర్శి అలెక్స్ అజార్ ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రస్తుతం దేశంలో ఈ సంక్షోభం మరింత పెరుగుతుండటంతో తాము రంగంలోకి దిగక తప్పలేదని.ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అజార్ వెల్లడించారు.2019 నేషనల్ యూత్ టుబాకో సర్వే ప్రకారం అమెరికాలో ఐదు మిలియన్లకు పైగా మిడిల్, హైస్కూల్ విద్యార్ధులు ఈ-సిగరెట్లను వినియోగిస్తున్నారని తేలింది.అలాగే ప్రతిరోజు దాదాపు ఒక మిలియన్ మంది ఈ-సిగరెట్లను ఉపయోగిస్తున్నారని సర్వే పేర్కొంది.

పొగాకు, మెంతోల్ రుచిగల ఈ-సిగరెట్ల కంటే పండ్లు, పుదీనా వంటి ఈ-సిగరెట్ రుచుల పట్ల ఆకర్షితులవుతున్నారని మరో ఫెడరల్ సర్వేలో తేలింది.కాగా ఈ-సిగరెట్లను పూర్తి స్థాయిలో నిషేధం విధిస్తానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతేడాది సెప్టెంబర్‌లో ఇచ్చిన హామీకి తాజా ప్రకటన పూర్తి విరుద్ధంగా ఉండటంతో పలువురు విమర్శిస్తున్నారు.

Advertisement
'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 

తాజా వార్తలు