బతుకమ్మ పండుగ నిర్వహించే తొమ్మిది రోజులపాటు ప్రతిరోజూ ఓ రకమైన నైవేద్యాన్ని సమర్పిస్తారు.అయితే అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఎంగిలి పూల బతుకమ్మ:
మొదటి రోజు చేసే బతుకమ్మ కోసం నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
అటుకుల బతుకమ్మ :
రెండో రోజు సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
ముద్దపప్పు బతుకమ్మ :
మూడో రోజు ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.
నానే బియ్యం బతుకమ్మ :
నాలుగో రోజు నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.
అట్ల బతుకమ్మ :
ఐదో రోజు అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు.
అలిగిన బతుకమ్మ :
ఆరో రోజు ఆశ్వయుజ పంచమి.ఆనాడు ఎలాంటి నైవేద్యంమూ సమర్పించరు.
వేపకాయల బతుకమ్మ :
ఏడో రోజు బియ్యం పిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
వెన్నముద్దల బతుకమ్మ :
ఎనిమిదో రోజు నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
సద్దుల బతుకమ్మ : చివరి రోజైన తొమ్మది రోజు ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు.పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరన్నం, నువ్వులన్నం.తొమ్మిది రోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు ఉపయోగిస్తారు.
తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపువ్వు బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు.ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుని ఈ పూల పండుగ జరుపుకోవటానికి తయారవుతారు.
ఈ తొమ్మిది రోజులలో వీరు రోజూ బతుకమ్మలు చేసి, ప్రతీ సాయంత్రం వాని చుట్టూ తిరుగుతూ ఆడుతారు.ఆ తరువాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు
.DEVOTIONAL