ప్రచ్ఛన్న యుద్ధాలు ప్రపంచ శాంతికే విఘాతాలు !

1981లో ఐరాస సర్వసభ్య సమావేశంలో అహింస, జగడాలు, పోరాటాలు, యుద్ధాలు, హింసాత్మక ఘటనలు, మత విద్వోషాలు, తీవ్రవాద దుశ్చర్యలను కట్టడి చేస్తూనే.

దయ, కరుణ, సహానుభూతి, శాంతియుత సహజీవనం, కాల్పుల విరమణ, పర్యావరణ పరిరక్షణ, మతసామరస్యాలను నెలకొల్పాలనే సదుద్దేశంతో తీసుకున్న ఏకగ్రీవ తీర్మానం ప్రకారం ‘ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ పీస్‌’ నిర్వహిస్తున్నారు.

జాత్యహంకార అంతంతో ప్రపంచ శాంతి స్థాపన అనే నినాదంతో 21 సెప్టెంబర్‌ 2022న ప్రపంచ దేశాలు ‘అంతర్జాతీయ శాంతి దినం’ పాటించుట ఆనవాయితీగా మారింది.శాంతి పందిరి కిందనే ఆయురారోగ్య అభివృద్ధి సుసాధ్యమని గుర్తించిన నోబెల్‌ కమిటీ 1901 నుంచి నోబెల్‌ శాంతి బహుమతిని ప్రదానం చేయడం చూస్తున్నాం.

నేడు రష్యా - ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న భీకర యుద్ధంతో పాటు అఫ్ఘానిస్థాన్‌లో తాలిబాన్ల పాలనతో శాంతి పావురాలు రక్తాన్ని చిందిస్తున్నాయి.వీటితో పాటు ఇండియా - చైనా, ఇండో - పాక్‌, చైనా - థైవాన్‌ లాంటి పలు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని, ప్రపంచ శాంతిని వెక్కిరిస్తున్నాయి.

అమెరికన్‌ నాయకత్వాన నాటో దేశాల బలగాల విరమణతో ‘తాలిబనిస్థాన్‌’లో గన్‌ పాలనకు భీతిల్లిన ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని దేశం విడిచి వెళ్ళిపోవడం, నేటికీ అక్కడి ప్రజలు ప్రాణాలను అరచేతుల్లా పెట్టుకొని గజగజ వణుకుతూ బతుకుతున్నారు.మారణహోమాలను సృష్టించనున్న యుద్ధాలను నివారించాలనే నినాదంతో జపాన్‌లో బాలలు ఐరాసకు దానం చేసిన లోహ నాణాలతో తయారు చేసిన గంటను మోగించడంతో ప్రతి ఏట అంతర్జాతీయ శాంతి దినం ప్రారంభమవుతుంది.

Advertisement

శాంతియుత సహజీవనమే సుమధురమని, అశాంతి రక్తాన్ని చిందిస్తుందని, హింసతో ప్రాణభయం పెరుగుతుందని, యుద్ధాలతో మారణహోమాలు తథ్యమని గుణపాఠం నేర్చుకోవలసిన సమయమిది.దేశాల మధ్య సరిహద్దు వివాదాలు,ఛాందస మత విద్వేషాలు, ఆయుధాలతో అలజడులు ప్రపంచ శాంతి కపోతానికి గాయపరుస్తున్నాయి.

అంతర్జాతీయ శాంతి దినం రోజున పౌర సమాజం ఒక నిమిషం నిశ్శబ్దాన్ని పాటించడం, ప్రపంచ శాంతి సారాంశంతో సభలు/సమావేశాలు నిర్వహించడం, హింసాత్మక ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజల ఆత్మకు శాంతి కలిగేలా క్యాండిల్స్‌ వెలిగించడం, సర్వమత శాంతి ప్రార్థనలు, వనమహోత్సవాలు, వన్ భోజనాలు, శాంతి చర్చలు, పీస్‌ ఆర్ట్‌ ప్రదర్శనలు, శాంతి ర్యాలీలు/పోస్టర్లు/విద్యాలయాల్లో యువతకు పోటీలు నిర్వహించ వచ్చును.ప్రపంచ శాంతిని కోరుతూ ప్రచ్ఛన్న యుద్ధాలను తగ్గించడం, కాల్పుల విరమణ, యుద్ధ ఖైదీల విడుదల, యుద్ధ వాతావరణాన్ని తొలగించడం, ప్రపంచ దేశాలు తీవ్రవాద సంస్థల్ని మట్టు పెట్టడం లాంటి సవాళ్ళను అధిగమించాలి.ప్రపంచ శాంతి నెలకొన్నపుడు మాత్రమే సమ న్యాయం, అసమానతల తగ్గింపు, సుస్థిరాభివృద్ధి, ఆరోగ్యం, సర్వ మత సామరస్యాలు సుసాధ్యమని ప్రపంచ మానవాళి గుర్తించాలి.

శాంతి కపోతం విశ్వమంతట స్వేచ్ఛగా ఎగిరే సుదినాలు రావడానికి మనందరం చేయూత నిద్దాం.శాంతితోనే సౌభాగ్య జీవితమని ప్రచారం చేద్దాం.

చనిపోయిన కోళ్ల నుంచి ఎగిసిపడుతున్న మంటలు.. వీడియో చూసి నెటిజన్లు షాక్..
Advertisement

తాజా వార్తలు