ఎక్కడ చూసిన ఏడ విన్నా ఒకటే చర్చ.ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం సార్ చర్చలంటగదా? అని.ఇక ఉద్యోగస్తులకు మంచి రోజులొచ్చినట్లే.ఇక వారు కోరుకునే పీఆర్సీ, వయోపరిమితి పెంపు, ప్రమోషన్లు,ట్రాన్స్‌ఫర్లు తదితర సమస్యలు తీరినట్లేనని ఒకటే చర్చ.
ఈనేపథ్యంలోనే సీఎం కేసీఆర్ తీరుపై జనాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.తమ సమస్యల పరిష్కారానికి నిరసనలు, ధర్నాలు చేసి రోడ్డెక్కినా, సమ్మె సైరన్ మోగించినా ఉద్యోగ, కార్మికుల సమస్యల పరిష్కారానికి ముందుకురాని కేసీఆర్ సారు గత వారం పది రోజుల నుంచి అటు ఉద్యోగులకు ఇటు నిరుద్యోగులకు, ఎల్ఆర్ఎస్ రద్దు చేసి జనాలకు గుడ్ న్యూస్‌ల మీద గుడ్ న్యూస్‌లు చెప్తుండడం సీఎం సార్ అంతరంగిక ఆలోచనలు అసలు ఏమిటా అని బుర్రలు బద్ధలు కొట్టుకుంటున్నారు.

ఆకలవుతుందని అడిగితే గానీ అన్నం పెట్టని అమ్మ.అలాంటిది ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ, నిరుద్యోగ సమస్యలను సీఎం సార్ చక చక పరిష్కారం చూపేదిశగా కృషి చేస్తున్నారు.అధికారులకు డెడ్‌లైన్లు పెట్టి మరీ వాటిని పరిష్కరించాలని ఆదేశాలను జారీ చేయడమేంటని చర్చించుకుంటున్నారు.
అయితే సీఎం సార్ ఇలా చేయడానికి కారణం లేకపోలేదట.
ఇదంతా దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఫలితమేనని అంతా చర్చించుకుంటున్నారు.అందులోనూ త్వరలో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక, రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
అలాగే ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లకు కూడా ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో తమ పార్టీ గెలుపొందాలంటే ఉద్యోగ, నిరుద్యోగుల ఓట్లు మరీ ముఖ్యం.
దానికోసమే ఈవిధంగా వాళ్ల సమస్యల పరిష్కారానికి సీఎం నడుంబిగించారనే వాదన బలంగా వినిపిస్తోంది.
పైగా ఉద్యోగులు వేసే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎక్కువగా బీజేపీకే పోలయ్యాయి.
ఎమ్మెల్సీ ఎన్నికలకు ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థుల ఓట్లు కీలకం కానున్నాయి.ఎన్నికలకు వెళ్లే ముందు నిరుద్యోగుల కోసం జాబ్ నోటిఫికేషన్లు వేసి, ఉద్యోగుల కోసం పీఆర్సీ,వయోపరిమితి,ట్రాన్స్‌ఫర్లు లాంటి సమస్యలను పరిష్కరించి ఎన్నికలకు వెళ్తే లాభం చేకూరుతుందనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.త్వరలో ఉపాధ్యాయ సంఘాల నేతలతోనూ సీఎం భేటీ అవుతారట.ఇంకేముంది వాళ్ల సమస్యలు కూడా పరిష్కారమ్యేను.మొత్తానికైతే దుబ్బాక ఓటమి, జీహెచ్ఎంసీ ఓటమి గాలాబీ బాస్‌లో మంచి మార్పునే తీసుకొచ్చిందనే చర్చ అటు ప్రజల్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ జోరుగా జరుగుతోంది.