కోర్టు ఆదేశాలతో డెక్కన్ యాజమాన్యంపై కేసు నమోదు...!

సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జారీ చేసిన ఆదేశాలతో పాలకవీడు మండలం భవానిపురంలోని డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎం.డి.

బంగారురాజు,అసిస్టెంట్ జనరల్ మేనేజర్ నాగమల్లేశ్వరరావుతో సహా 9 మందిపై పాలకవీడు పోలీస్ స్టేషన్ లో వివిధ సెక్షన్ల కింద క్రైమ్ నెంబర్ 28/2024 ద్వారా కేసు నమోదు చేసినట్లు బాధితుల తరఫు న్యాయవాది కాల్వ శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.పాలకవీడు మండలంలోని రావిపహాడ్ గ్రామానికి చెందిన కల్లేటి వెంకయ్యకు 1975లో ఆనాటి ప్రభుత్వం రావిపహాడ్ రెవిన్యూలోని సర్వేనెంబర్లు 31/7,31/18 లో జీవనోపాధి నిమిత్తం ఐదెకరాల ప్రభుత్వ భూమిని కేటాయించింది.

అప్పటి నుండి అతను, అతని వారసులు పోడుకొట్టుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు.ఆ భూమికి సమీపంలోని డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం తన ఫ్యాక్టరీని విస్తరణలో భాగంగా ఎలాగైనా దాన్ని కాజేయాలని ప్లాన్ వేశారు.

రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ఆ భూమిని ప్రభుత్వానికి స్వాధీన పరుస్తున్నట్లుగా వేరే వ్యక్తి చేత దరఖాస్తు పెట్టించి, ప్రభుత్వం ద్వారా తిరిగి డెక్కన్ ఫ్యాక్టరీకి కేటాయిస్తున్నట్లుగా డూప్లికేట్ రికార్డులు తయారు చేశారు.కానీ, ఇప్పటికీ ఆ భూమి కల్లేటి వెంకయ్య వారసుల స్వాధీన అనుభవంలోనే ఉంది.

Advertisement

దాంతో డెక్కన్ ఫ్యాక్టరీ యాజమాన్యం తరచుగా వారిని ఇబ్బంది పెడుతూ ఆ భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకొనే ప్రయత్నం చేస్తుంటే కల్లేటి వెంకయ్య కుమారులు,కుమార్తెలు కల్లేటి పెద్ద సైదులు,కల్లేటి చిన్న సైదులు,గడగంట్ల సైదమ్మ, నీలం గురవమ్మ, గడగంట్ల లక్ష్మి పాలకవీడు పోలీస్ స్టేషన్లో డెక్కన్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు.కానీ, పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో హుజూర్ నగర్ సిఐ, కోదాడ డిఎస్పీ, సూర్యాపేట ఎస్పీలకు రిజిస్టర్ పోస్టు ద్వారా ఫిర్యాదు చేశారు.

అయినా కేసు నమోదు చేయకపోవడంతో తమ న్యాయవాది కాల్వ శ్రీనివాసరావు ద్వారా న్యాయస్థానాన్ని ఆశ్రయించి కంప్లైంట్ దాఖలు చేశారు.కంప్లైంట్ ను పరిశీలించిన న్యాయస్థానం పాలకవీడు పోలీసులను డెక్కన్ యాజమాన్యంపై కేసు నమోదు చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు.

కోర్టు ఆదేశాలతో పాలకవీడు పోలీసులు డెక్కన్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఆత్మకూర్(ఎస్) మండలంలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన
Advertisement

Latest Suryapet News