శ్రీ కృష్ణుడు, శివుని గురించి తపస్సు చేయడం, శివుని గొప్పదనాన్ని, మహాత్మ్యాన్ని చాటడం వంటి సందర్భాలు వరాహ పురాణంలో కనిపిస్తాయి.జాంబవతి కోరిక మీద పుత్రార్థియై కృష్ణుడు, శివ భక్తుడైన ఉపమన్యు ఉపదేశం ప్రకారం ఈశ్వరుని గురించి తపస్సుచేసి శివ సాక్షాత్కారాన్ని పొందడం, శివుడు ఎంతో ప్రేమతో కృష్ణుని కైలాసానికి తీసుకుని పోవడం, అక్కడ కొంత కాలం వినోదిస్తూ ఉండగా, కృష్ణుడు లేని కారణాన ద్వారకను రాక్షసులు ముట్టడించడం, బలరాముడు నారదుని ద్వారా కృష్ణుని జాడ తెలుసుకొని, గరుత్మంతుని కైలాసా నికి పంపడం, కృష్ణుని రాకతో రాక్షసులు పారిపోవడం వంటి సంఘటనలు వివరంగా ఉన్నాయి.
అనంతరం జాంబవతికి సాంబుడు జన్మించాడు.
ఒకనాడు మార్కండేయ మహాముని ద్వారకకు రాగా, శ్రీ కృష్ణుడు అతిథి సత్కారాలు చేసి, తనకు ఆత్మ యోగాన్ని బోధించమని కోరడం, మార్కండేయుడు అన్నియోగాలు శ్రీ కృష్ణుని కోసమేనని, యోగమయ పురుషుడైన శ్రీ కృష్ణునికి చెప్పగల వాడను కానని చెప్పి, శివలింగోద్భవ గాథను తెలుపమని కృష్ణుడినే మార్కండేయుడు కోరాడు.
ఆ సందర్భంలో కృష్ణుడు శివలింగోద్భ వాన్ని గురించి తెలుపుతూ ప్రళయంలో అంతా నశించి జలమయంగా అంధకారంలో ఉండగా, తాను విరూడ్రూపంలో వెయ్యి తలలు, వెయ్యి చేతులు, వెయ్యి ముఖాలు కలిగి జలం మీద పడుకుని నిద్రించి ఉండగా బ్రహ్మ రావడం సంభవించిందనీ తను, బ్రహ్మ, ఆ లింగానికి ఆద్యంతాలు కనుక్కోలేక శివుని స్తోత్రం చేయగా, నిజ రూపంలో పరమేశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడనీ బ్రహ్మ విష్ణువు ఈశ్వరుని నుండి పుట్టిన వారేనని కృష్ణుడు మార్కండేయుడికి తెలిపాడు.