కాపుల్లో కుల చిచ్చు రగిల్చి అమాంతం పెద్ద కుల నాయకుడిగా ఎదిగిపోయిన ముద్రగడ పద్మనాభం రాబోయే రోజుల్లో ఏ పార్టీకి మద్దతు తెలపబోతున్నారు.? అసలు ఆయన ఏ పార్టీ నుంచి బరిలోకి దిగబోతున్నారు.? అనే సందేహం ఇప్పుడు అన్ని రాజకీయ వర్గాల్లోనూ వ్యక్తం అవుతోంది.ఏపీలో బలమైన కాపు సామజిక వర్గాన్ని ఒక్కతాటిపై నడిపించి కుల ఉద్యమ నాయకుడిగా పేరు తెచ్చుకున్న పద్మనాభం ఏ పార్టీకి మద్దతు ఇస్తారనేది ఇప్పుడు కీలకంగా మారింది.

ఆయన వెనుక వైఎస్సార్‌సీపీ ఉందని, ఆ పార్టీ అధినేత జగన్ చెప్పినట్లు పద్మనాభం ఆడుతున్నారంటూ టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.మరొకవైపు ఆయన ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన కాపు సామాజికవర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణతో భేటీ అవ్వడం తో అసలు పద్మనాభం అడుగులు ఎటువైపు అనేది సందేహంగా మారింది.
ఒకవైపు ఏపీలో బీజేపీ బలపడాలని చూస్తోంది.దానికోసం ఏపీలో బలమైన నాయకుల కోసం ఆ పార్టీ ఎదురుచూస్తోంది.ఇటువంటి పరిస్థితుల్లో ఆయన కన్నాను కలవడంతో ముద్రగడ బీజేపీలో చేరబోతున్నారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ముద్రగడను తమ పార్టీలో చేరాల్సిందిగా రాయబారాలు పంపుతోంది.
టీడీపీ అంటే ఒంటికాలిపై లేచే ముద్రగడ ఎలాగైనా ఆ పార్టీకి అధికారం రాకుండా చేయాలనీ గ్రౌండ్ లెవల్ లో పెద్ద నెట్వర్క్ నడుపుతున్నాడు.ఈ దశలో బీజేపీ , వైసీపీ కూడా టీడీపీని దెబ్బకొట్టాలంటే ముద్రగడ సరైన వ్యక్తి అని భావిస్తున్నాయి.
ఆయన ఏ పార్టీలో చేరినా ఆ సామాజికవర్గం బలం చాలా వరకు సంపాదించినట్టే అని ఇరు పార్టీలు భావిస్తున్నాయి.
ఈ దశలో ముద్రగడ వైసీపీ వైపు పాజిటివ్‌గా ఉన్నారని అంతా భావిస్తున్నారు.
ముఖ్యంగా కాపు సామాజికవర్గ ఓటర్లపై జగన్ దృష్టిసారించిన నేపథ్యంలో.ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించాలని చూస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఆయనను ప్రత్తిపాడు నుంచి పోటీచేయించాలని భావిస్తున్నారు.ముద్రగడ మరోవైపు తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు విషయంలో కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.
బీజేపీ విషయానికి వస్తే… గతంలోనే ముద్రగడ బీజేపీలో పనిచేసాడు.ఈ చనువుతో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నాతో ఉన్న సంబంధాల కారణంగా రాబోయే ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి వీలైనన్ని టిక్కెట్లు ఇప్పించుకోవాలని ముద్రగడ భావిస్తున్నాడట.
ఇదే సమయంలో వైసీపీ నేతలు కూడా ముద్రగడ కోసం గట్టిగాఈ ప్రయత్నిస్తున్నారు.ఈయన కనుక వస్తే ముఖ్యంగా అన్ని పార్టీలకు కీలకం అయిన గోదావరి జిల్లాల్లో బలమైన సామాజికవర్గం ఓట్లు గంపగుత్తగా కొట్టేసి అధికార పీఠం దక్కించుకోవచ్చని వైసీపీ ఆశపడుతోంది.
అయితే ముద్రగడ మనసులో ఏముంది .? ఆయన ఎవరికీ మద్దతు పలుకుతారు .? ఏ పార్టీలో చేరతారు అనేది కొద్దిరోజుల్లో సస్పెన్స్ వీడే అవకాశం కనిపిస్తోంది.