అధికార పార్టీలోకి వలసలకు కారణమేంటి...?

సూర్యాపేట జిల్లా: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సూర్యాపేట రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి.

సూర్యాపేట పట్టణ మరియు నియోజకవర్గ పరిధిలో గట్టి పట్టున్న కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు మరింత డీలా పడిపోతుంది.

కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ప్రజా ప్రతినిధులు ఒక్కరొక్కరు కారెక్కడానికి ఉవ్విళ్లరుతున్నారు.రెండు రోజుల క్రితం కాంగ్రెస్ కౌన్సిలర్ మడిపల్లి విక్రమ్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరిన ఘటన మరువక ముందే శుక్రవారం మరో కాంగ్రెస్ కౌన్సిలర్ కొండపల్లి భద్రమ్మ గులాబీ గూటికి చేరారు.

హైదరాబాద్ మంత్రుల నివాస ప్రాంగణంలో సూర్యాపేట ఎమ్మెల్యే,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో కౌన్సిలర్ భద్రమ్మతో పాటు ఐఎన్టియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండపల్లి సాగర్ రెడ్డి,ఐఎన్టీయూసీ జాతీయ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ రెడ్డి,జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే రషీద్,కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యదర్శి అబ్దుల్ రెహమాన్,పట్టణ నాయకులు జమాల్ బాబా,పుట్ట రవీందర్ రెడ్డి, అమర్నాథరెడ్డి తదితరులు .బీఆర్ఎస్ లో చేరగా వారికి మంత్రి జగదీష్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.మడిపల్లి విక్రమ్,కొండపల్లి భద్రమ్మ సాగర్ రెడ్డిల బాటలో మరి కొంతమంది కౌన్సిలర్లు మండల,పట్టణ నాయకులు,కొందరు బీజేపీ నేతలు కూడా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

సూర్యాపేటలో కాంగ్రెస్ ఖాళీ అవుతుందా.?కాంగ్రెస్ అధిష్టానం లోపమా లేక జిల్లా నాయకత్వంలో పెరిగిన అంతరాల ప్రభావమా?తెలియదు గానీ,కాంగ్రెస్ వీడడానికి మరికొందరు సిద్ధంగా ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఇదే బాటలో బీజేపీ కౌన్సిలర్లు, నాయకులు కూడా బీఆర్ఎస్ లో చేరికకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Advertisement

మంత్రి మంత్రాంగం ఫలిస్తుందా.?జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్ధి పార్టీలను నిర్వీర్యం చేయడంలో సఫలీకృతం అవుతున్నారా అంటే జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తే నిజమే అనిపిస్తుంది.ప్రతిపక్షాలు అంతర్గత పంచాయితీల్లో తలమునకలై ఉంటే,ఇదే అదునుగా మంత్రి తన రాజకీయ చాణక్యం ప్రదర్శించి ప్రతిపక్షాల బలహీనతలు సొమ్ము చేసుకుంటూ బీఆర్ఎస్ ను పటిష్ట స్థితిలోకి తెచ్చే పనిలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది.

ఇది ఇలాగే కొనసాగితే పేట కాంగ్రెస్ ఖాళీ అయ్యే అవకాశాలు లేకపోలేదని కాంగ్రెస్ కార్యకర్తలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అంతర్గత విభేదాలు పక్కన పెట్టి ఐక్యంగా ముందుకు వెళ్లకపోతే భారీ మూల్యాన్ని కాంగ్రెస్ మూట కట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు