నల్లగొండ జిల్లా: గిరిజనుల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని,సాగర్ నియోజకవర్గంలో తాము చేపట్టిన గిరిజన చైతన్య యాత్రతో స్ఫూర్తి పొంది రాష్ట్రంలో గిరిజనులు, ఇతర వర్గాల ప్రజలంతా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని సిఎల్పీ మాజీ నేత,మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి పిలుపునిచ్చారు.సోమవారం నాగార్జునసాగర్ నియోజకవర్గంలో జానా తనయుడు కుందూరు జయవీర్ రెడ్డి చేపట్టిన గిరిజన చైతన్య యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో గుడిసెలుగా ఉన్న గిరిజన తండాలు పక్కా గృహాలతో ఆవాసాలుగా మారాయన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు పంపిణీని చేసిన భూములను కేసీఅర్ ప్రభుత్వం కొల్లగొడుతుందని ఆరోపించారు.గిరిజనులు పోడు పట్టాల కోసం పోరాడుతూ ఎదురు చూస్తున్నారన్నారని,
గిరిజన తండాలకు గతంలో తన హయాంలో మంచినీటి వసతి,పక్కా ఇండ్లు,విద్యుత్ వసతి కల్పించామని గుర్తు చేశారు.
ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలుగా మిగిలిపోయాయని, రానున్న ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు తమ రాజకీయ చైతన్యంతో గుణపాఠం చెప్పాలన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ,తండాల అభివృద్ధికి నిధులు,రెండు లక్షల రైతు రుణమాఫీ అమలు చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో జయ వీర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.