సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత ప్రతిదీ ఆన్లైన్ అయిపోయింది. తుమ్మినా , దగ్గినా అది అందరూ చూడాలి అన్నట్టు గా జనాలు తయారయ్యారు.
ఇక రాజకీయ నాయకుల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.వారు ఏం చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా, ఏ కార్యక్రమంలో పాల్గొన్నా, ప్రతిదీ అందరూ చూడాలి అనుకుంటారు.
గతంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా నాయకులు తాము ఈ కార్యక్రమం చేస్తున్నాము అనేది జనాలకు తెలిసేలా ప్రచారం చేసుకునేవారు.కానీ ఇప్పుడు నాయకులు సోషల్ మీడియా లైవ్ ద్వారా తాము ఏమి చేస్తున్నాము, ఎలా చేస్తున్నాం అనేది జనాలకు తెలిసెలా చేయడంతో పాటు అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే ఏది లైవ్ ఇవ్వాలి, ఇవ్వకూడదు అనే దానిపై నాయకులు సీరియస్ గా దృష్టిపెట్టకపోవడం తో అనర్ధాలు ఎన్నో జరిగిపోతున్నాయి.
మొన్నీ మధ్యనే టిడిపి ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు టిడిపి పై చేసిన అనుచిత వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి.
అయితే ఇదంతా సీక్రెట్ గా వీడియో చిత్రీకరణ జరిగింది .అయినా వైసిపి ఈ ఉదంతాన్ని బాగా హైలెట్ చేసుకుంది .సొంత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే స్వయంగా పార్టీ పరిస్థితి గురించి ఈ విధంగా మాట్లాడారు అంటూ వైసీపీ ఆరోపణలు చేసింది.అది జరిగిన కొద్ది రోజులకే రాజమండ్రి వైసీపీ ఎంపీ మార్గాన్ని భరత్, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్, వైసిపి రాజమండ్రి ఇన్చార్జి ఆకుల సత్యనారాయణ తదితరులు కరోనా కు సంబంధించిన వ్యవహారాలపై మాట్లాడిన మాటలు లైవ్ లో రావడం వైసీపీలో కలకలం సృష్టించింది.

ఇక మరో సందర్భంలోనూ ఏపీలో కరోనా పరిస్థితులపై ఎంపీ మార్గని భరత్ కొంతమంది ప్రముఖులతో పర్సనల్ గా మాట్లాడిన మాటలు లైవ్ లో రావడం మరోసారి సంచలనంగా మారింది.అయితే మార్గాని భరత్ కు తాను చేసే ప్రతి కార్యక్రమం ఫేస్ బుక్ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేయడం అలవాటు.అయితే పార్టీ విషయాలపై అంతర్గతంగా మాట్లాడుకునే మాటలు లైవ్ లో వస్తున్న విషయాన్ని ఆయన గమనించకపోవడం ఆయనకు సంబంధించిన సోషల్ మీడియా నిర్వహించే వ్యక్తులకు ఏది లైవ్ ఇవ్వాలి ఇవ్వకూడదు అనే దానిపై పెద్దగా పరిజ్ఞానం లేకపోవడం, ఇలా కారణం ఏదైనా వైసిపి అభాసుపాలు అయ్యింది.వీరే కాదు వైసీపీలో మరెంతో మంది నాయకులు ఇదే విధంగా వ్యవహరిస్తూ పార్టీకి కొత్త తలనొప్పులు తీసుకు వస్తున్నారు.