తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతి విషయంలోనూ అందరికంటే భిన్నంగా వ్యవహరిస్తూ వస్తుంటారు.దేశమంతా ఒక రూట్లో వెళితే, తాను ఇంకో రూట్లో వెళ్తాను అన్నట్టుగా కేసీఆర్ వ్యవహరిస్తూ ఉంటారు.
ప్రస్తుతం కరోనా దేశాన్ని అతలాకుతలం చేస్తోంది.ప్రతి ఒక్కరూ ఈ వైరస్ కారణంగా ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ నిబంధనలు కేంద్రం విధించింది.అసలు కేంద్రం లాక్ డౌన్ విధించక ముందే కేరళ, తెలంగాణ వంటి రాష్ట్రాలు కరోనా విషయంలో కఠిన నియమ నిబంధనలు విధించి ఆ రాష్ట్రాల్లో వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టం చేశారు.
ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూ విధించిన రోజు నుంచి తెలంగాణలో పూర్తిస్థాయిలో లాక్ డౌన్ నిబంధన అమలు అవుతోంది.ఆ సందర్భంగా ఎమర్జెన్సీ సర్వీసులు మినహా, మరేవీ తెరుచుకోకుండా కఠినంగా లాక్ డౌన్ అమలు చేశారు.
కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చినా కేసీఆర్ మాత్రం వాటిని పట్టించుకోకుండా కఠినంగా ఈ నిబంధన అమలు చేస్తున్నారు.
ఇక కేంద్రం రెండోసారి అంటే మే మూడు వరకు లాక్ డౌన్ ప్రకటించింది.
కేసీఆర్ మాత్రం తెలంగాణలో ఏడో తేదీ వరకు పొడిగించి అమలు చేస్తున్నారు.ఇప్పుడు కేంద్రం మే 17 వరకు లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మే 4 తేదీ తర్వాత కేంద్రం ప్రకటించిన సడలింపులు తెలంగాణలో అవుతాయా లేదా అనే దానిపై అందరిలోనూ అనుమానాలు తలెత్తుతున్నాయి.టిఆర్ఎస్ ప్రభుత్వం జనతా కర్ఫ్యూతో కలిపి మొత్తం 47 రోజులుగా విధించింది.
అయితే ఈ నిబంధనల కారణంగా రాష్ట్రానికి ప్రధాన ఆదాయ మార్గాలు అయిన రిజిస్ట్రేషన్ లు, వాహనాల అమ్మకం, మద్యం అమ్మకాల ద్వారా వచ్చే వాణిజ్య పన్నులు మొత్తం ఎక్కడికక్కడ ఆగిపోయాయి.దీంతో పాటు అనేక పరిశ్రమలు మూతపడ్డాయి.
లాక్ డౌన్ నిబంధన కారణంగా తెలంగాణలో రోజుకు సుమారు 400 కోట్ల వరకు ప్రభుత్వం ఆదాయం కోల్పోతోంది.ఈ లెక్కన చూస్తే ఇప్పటి వరకు 19 వేల కోట్ల వరకు ప్రభుత్వ ఆదాయం కోల్పోయింది.దీంతో పాటు కరోనాపై పోరుకి భారీగా నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఒకవైపు వైద్య పరికరాలు, రక్షణ కవచాలు, ఔషధాలు ఇలా అన్నింటికీ భారీగా సొమ్ము ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి.
దీంతో పాటు క్వారంటైన్, ఐసోలేషన్ లో ఉన్న వారికి ప్రభుత్వమే పౌష్టికాహారం అందించాల్సిన పరిస్థితి.ఒక వైపు చూస్తే ఆదాయం కోల్పోవడం, మరోవైపు భారీగా నిధులు ఖర్చు చేయాల్సి రావడంతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైంది.
దీంతో ఆదాయ మార్గాలను పెంచుకునే మార్గాలపై టిఆర్ఎస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది.
ఇప్పటికే మే నాలుగు నుంచి కేంద్రం కొత్త మార్గదర్శకాలను ప్రకటించడం, రెడ్ జోన్లు ఉన్నచోట కఠిన నిబంధనాలు అమలు చేసి ఆరెంజ్, గ్రీన్ జోన్లలో సాధారణ కార్యక్రమాలకు అనుమతి ఇవ్వాలని కేంద్రం సూచించింది.
అయితే ఇప్పటి వరకు ఆవిధంగా చేసేందుకు నిరాకరించిన కేసీఆర్, ఇప్పుడు కేంద్రం బాటలో వెళ్లడమే సరైన నిర్ణయం అన్నట్టుగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ నెల 5వ తేదీన తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరగనున్న నేపథ్యంలో, అప్పుడు దీనిపై స్పష్టమైన క్లారిటీకి రావాలని కేసీఆర్ చూస్తున్నారట.
ఇప్పటి వరకు అన్ని రాష్ట్రాలు కేంద్రం బాటలో నడుస్తున్నాయి.
తెలంగాణ మాత్రం సొంతంగా ముందుకు వెళుతుందనే భావన కేంద్రం పెద్దలకు కూడా ఉంది.
లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత ఆర్థికంగా కేంద్రమే ఆదుకోవాల్సిన పరిస్థితి ఉండడంతో అప్పటి నుంచే కేంద్రం బాటలో నడిస్తే నిధులు అడిగేందుకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవని కెసిఆర్ ఆలోచనగా తెలుస్తోంది.అందుకే కేంద్రం బాటలోనే వెళ్లాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.