గుంటూరు కార్పొరేషన్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది.టీడీపీకి మంచి బలం ఉన్న ఈ కార్పొరేషన్‌లో తా జాగా మేయర్ పీఠంపై ముడిపడింది.
తమకు ఈ మేయర్ పీఠాన్ని అప్పగించాలని మాజీ ఎంపీ రాయపా టి కుటుంబం పట్టుబడుతోంది.గతంలో రాయపాటి శ్రీనివాస్ కాంగ్రెస్ తరఫున మేయర్‌గా ఇక్కడ చక్రం తిప్పారు.
ఇప్పుడు ఆయన తటస్థంగా ఉన్నారు.అయితే మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మాత్రం టీడీపీలోనే ఉన్నారు.
ఈ నేపథ్యంలో మేయర్ పీఠాన్ని తమకు అప్పగించాలంటూ చంద్రబాబుకు తాజాగా ఆయన వినతి పంపించినట్టు తెలుస్తోంది.
అయితే దీనిపై చంద్రబాబు ఇప్పటి వరకు మౌనం వహించారు.
మరోవైపు రాయపాటి లేఖ రాశారని తెలియడంతో మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ కూడా లేఖను సంధించారట.మేయర్ పీఠంపై నిర్ణయం తీసుకునే ముందు నేతలతో చర్చించాలని ఇక్కడ అనేక మంది పార్టీ కోసం పనిచేసిన వారు ఉన్నారని కాబట్టి ఎలాంటి నిర్ణయమైనా చర్చించాలని కోరారని తెలుస్తోంది.
దీంతో ఇప్పుడు గుంటూరు టీడీపీలో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.గుంటూరు వెస్ట్, గుంటూరు తూర్పు నియోజకవర్గాల పరిధిలో ఇప్పుడు వైసీపీ హవా నడుస్తోంది.

ఈ క్రమంలో గుంటూరు మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం టీడీపీకి కత్తిమీద సాము లాంటిదే.మరోవైపు గుంటూరును గెలిపించే బాధ్యతను ఎమ్మెల్యే ముస్తాఫాకు వైసీపీ అధిష్టానం అప్పగించిందని అంటున్నారు.అదేసమయంలో మాజీ ఎమ్మెల్యే లేళ్ల అప్పిరెడ్డి కూడా పావులు కదుపుతున్నారు.ఇప్పుడు ఆయన ఇక్కడ వార్డు వార్డుకు తిరుగుతున్నారు.మాచర్లలో వైసీపీ భారీ ఎత్తున ఏకగ్రీవాలను సొంతం చేసుకోవడంలో అక్కడ ఇంచార్జ్‌గా వ్యవహరించిన లేళ్ల అప్పిరెడ్డి దూకుడుగా ముందుకు సాగారు.

దీంతో ఆయనకు సీఎం జగన్ దగ్గర మంచి మార్కులు పడ్డాయి.ఇక, ఇప్పుడు ఇదే దూకుడుతో గుంటూరు కార్పొరేషన్‌లోనూ సక్సెస్ కావాలని చూస్తున్నారు.వైసీపీ ఇలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంటే టీడీపీ మాత్రం మేయర్ పీఠం కోసం పాకులాడుతుండడం గమనార్హం.
చివరికి నాయకులు పార్టీని ముంచుతారేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.మరి చంద్రబాబు ఏంచేస్తారో చూడాలి.