బిగ్‌బాస్‌2.. ఇది నిజమైతే సూపర్‌ హిట్‌       2018-06-05   23:14:09  IST  Raghu V

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు బిగ్‌బాస్‌ షో రెండవ సీజన్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి సీజన్‌కు ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించగా, రెండవ సీజన్‌కు నాని హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడు. జూన్‌ 10న ప్రారంభం కాబోతున్న బిగ్‌బాస్‌ సీజన్‌ 2 గత సీజన్‌తో పోల్చితే నెల రోజుల పాటు ఎక్కువ రోజులు కొనసాగబోతుంది. అంటే 100 రోజు బిగ్‌బాస్‌ షోను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగిపోయాయి. బిగ్‌బాస్‌ సీజన్‌ 2కు నాని హోస్ట్‌ అనగానే కాస్త అంచనాలు తగ్గాయి. కాని నానిపై స్టార్‌ మా వారు మాత్రం చాలా అంచనాలు పెట్టుకున్నారు.

మొదటి సీజన్‌తో పోల్చితే రెండవ సీజన్‌ మరింత జోరుగా, రసవత్తరంగా సాగుతుందనే నమ్మకంను స్టార్‌ మా వారు వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వారం కూడా షోను ఆసక్తికరంగా మల్చేందుకు కొత్త కొత్త ప్రణాళికలు సిద్దం చేశారు. అందులో భాగంగానే సీజన్‌ 2 ప్రారంభోత్సవంకు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్‌ చేతుల మీదుగా ఈ షోను ప్రారంభించి నానికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పించాలని స్టార్‌ మా వారు ప్రయత్నిస్తున్నారు. అందుకు ఎన్టీఆర్‌ కూడా సుముఖంగా ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు 50వ రోజు కూడా ఎన్టీఆర్‌ ప్రత్యేక అతిథిగా హాజరు అవుతాడు అంటూ విశ్వసనీయ సమాచారం అందుతుంది.

ఈ సీజన్‌లో ఇంకా పలువురు టాలీవుడ్‌ సెలబ్రెటీలు మరియు ఇంకా ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నారట. వారాంతంలో నాని రెండు రోజులు వస్తాడు. ఆ రెండు రోజుల్లో ఏదో ఒక రోజు ప్రత్యేక అతిథులను తీసుకు రాబోతున్నారు. అలాగే అప్పుడప్పుడు పార్టిసిపెంట్స్‌ కుటుంబ సభ్యులను కలిపించడం, లేదా వారితో మాట్లాడివ్వడం చేస్తారట. గత సీజన్‌లో పార్టిసిపెంట్స్‌ వద్దకు కుటుంబ సభ్యులు వచ్చిన ఎపిసోడ్‌కు ఫుల్‌గా టీఆర్పీ దక్కింది. అందుకే ఒకేసారి కాకుండా ఒక్కొక్కరు చొప్పున పార్టిసిపెంట్స్‌ కుటుంబ సభ్యులను పంపించి షోను ఆసక్తికరంగా మార్చాలని స్టార్‌ మా ప్రయత్నాలు చేస్తోంది. ఇంకా పలు రకాలుగా స్టార్‌ మా వారు బిగ్‌బాస్‌ సీజన్‌ 2ను విజయవంతం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. సినీ ప్రముఖుల నుండి మొదటి సీజన్‌ కంటే రెండవ సీజన్‌కు ఎక్కువగా ఆధరణ లభిస్తుంది.

మొదటి సీజన్‌ను పట్టించుకోని కొందరు రెండవ సీజన్‌పై ఆసక్తిని కలిగి ఉన్నారు. కారణాలు ఏమైనా కూడా నాని హోస్ట్‌ అన్నప్పటికి బిగ్‌బాస్‌ ఆకట్టుకుంటుందనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుండి ఈసారి మరింత మసాలా అంటూ ప్రచారం చేస్తున్నారు. దాంతో పాటు ఏదైనా జరగొచ్చు అంటూ కూడా పబ్లిసిటీ చేస్తున్నారు. స్టార్‌ మా టీవీ ఏ షో చేసినా కూడా భారీగా ఉంటుందనే విషయం తెల్సిందే. స్టార్‌ ఇండియా వారు ఈ షోను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్ల బిగ్‌బాస్‌ హౌస్‌ కూడా అద్బుతంగా రూపొందించి ఉంటారు అంటూ సమాచారం అందుతుంది. జూన్‌ 10న బిగ్‌బాస్‌ ఇల్లు పరిచయంతో పాటు, పార్టిసిపెంట్స్‌ పరిచయం కూడా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. పైన పేర్కొన్నట్లుగా జరిగితే బిగ్‌బాస్‌ సీజన్‌ 2 సూపర్‌ సక్సెస్‌ అవ్వడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.