18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరినీ ఓటరు జాబితాలో నమోదు చేయాలి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 18 సంవత్సరాలు నిండి అర్హులైన ప్రతీ ఒక్కరినీ ఓటరు జాబితాలో నమోదు చేయాలని, ఎలాంటి తప్పిదాలు జరగకుండా పారదర్శకమైన ఓటరు జాబితా రూపొందించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.

రెండవ ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని తారకరామానగర్ లో గల 144,145, గాంధీ నగర్ లోని బాలరక్ష భవన్ లో గల 121,133 పోలింగ్ కేంద్రాలలో చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త పునరీక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు.

మీ పోలింగ్ కేంద్రం పరిధిలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు? జాబితా నుండి ఎంతమందిని తొలగించారు? ఒకవేళ తొలగిస్తే ఏ కారణంతో తొలగించారు? అనే విషయాలను జిల్లా కలెక్టర్ బూత్ లెవల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఓటరు జాబితాను ఒకటికి రెండు సార్లు పరిశీలించి, పొరపాటున ఎవరినైనా తొలగించి ఉంటే వారిని వెంటనే తిరిగి నమోదు అయ్యేలా చూడాలని అన్నారు.

ఏవైనా తొలగించాల్సి వస్తే నిబంధనలను అనుసరించి నోటీస్ జారీ చేయడం ముఖ్యమని తెలిపారు.ప్రతి వెయ్యి మంది ఓటర్లలో సగటున 50 మంది కొత్త ఓటర్లు ఉండేలా చూసుకోవాలన్నారు.

పోలింగ్ బూత్ పరిధిలో 18 సంవత్సరాలు నిండిన వారి జాబితాను తీసుకొని వారందరూ నమోదయ్యేలా ప్రత్యేక చొరవ చూపాలన్నారు.అక్టోబర్ 1, 2023 నాటికీ 18 సంవత్సరాలు నిండిబోయే వారందరూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని అన్నారు.

Advertisement

ఓటర్ జాబితా ప్రత్యేక సంక్షిప్త పునరీక్షణ కార్యక్రమం తిరిగి సెప్టెంబర్ 2,3 వ తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాలలో నిర్వహించడం జరుగుతుంది తెలిపారు.ఈ కార్యక్రమాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకునేలా ప్రతీ ఒక్కరికీ అవగాహన కల్పించాలని అన్నారు.

తనిఖీలో కలెక్టర్ వెంట ఆర్డీఓ ఆనంద్ కుమార్, తహశీల్దార్ షరీఫ్ మొహినొద్దీన్, నాయబ్ తహశీల్దార్ మనోజ్, ఆర్ఐ లు సంతోష్, శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.

Advertisement

Latest Rajanna Sircilla News