తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది.ఆయన కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి ఆ పార్టీకి మైలేజ్ పెరిగేలా చేయడంతో పాటు ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న టిఆర్ఎస్, కెసిఆర్, కేటీఆర్ వ్యవహారాలను విమర్శిస్తూ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరి నాయకులకంటే భిన్నంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ వస్తున్నారు.
అయితే రేవంత్ రెడ్డి పార్టీలో చేరిన అతి స్వల్పకాలంలోనే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు పొందడం, ప్రస్తుతం పిసిసి అధ్యక్ష పదవి రేసులో ఉండడంతో తెలంగాణ సీనియర్ నాయకులంతా రేవంత్ రెడ్డి పై గుర్రుగా ఉన్నారు.అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి విషయంలో సానుకూలంగా ఉంటూ తమను పెద్దగా పట్టించుకోవడం లేదన్న బాధ కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకుల్లో ఉంది.
ప్రస్తుతం రేవంత్ రెడ్డి డ్రోన్ కెమెరా వ్యవహారంలో రిమాండ్ లో ఉన్నారు.దీంతో ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంతా ఒక్కొక్కరుగా రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
అసలు రేవంత్ కు కాంగ్రెస్ కి సంబంధం లేదని, ఆయన వ్యక్తిగతంగా వాటిని ఎదుర్కోవాలంటూ గట్టిగానే చెబుతున్నారు.ముఖ్యంగా ఈ విషయంలో సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
ఇక దామోదర రాజనర్సింహ, వి.హనుమంతరావు తదితరులు విమర్శలు చేసేందుకు ముందుకు వస్తున్నారు.రేవంత్ రెడ్డి విషయం కంటే తెలంగాణ లో అనేక సమస్యలు ఉన్నాయని, వాటి మీద మాట్లాడితే మంచిదని కాంగ్రెస్ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయినట్టుగా కనిపిస్తోంది.ఎమ్మెల్యే సీతక్క, షబ్బీర్ అలీ, మల్లు రవి వంటివారు అండగా నిలబడుతున్నారు.రేవంత్ జైలు నుంచి విడుదల కాగానే ఆయనకు మద్దతుగా భారీగా ర్యాలీ చేయాలని చూస్తున్నారు.
ఇక రేవంత్ కూడా తెలంగాణలో తానే హీరో అనే సంకేతాలను ఇచ్చేందుకు జైలు నుంచి బయటకు వచ్చాక తన సత్తా చాటేందుకు తహతహలాడుతున్నారు.అయితే ఇన్ని జరుగుతున్నా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం బహిరంగంగా ఇప్పటి వరకు స్పందించలేదు.
దీంతో అసలు అధిష్టానం అభిప్రాయం ఏంటో ఎవరికీ తెలియకుండా పోయింది.తాజాగా రేవంత్ రెడ్డి కేసులో సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ ను కాంగ్రెస్ హైకమాండ్ నియమించడంతో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంతా షాక్ తిన్నారు.
ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ ప్రత్యేకంగా న్యాయవాదిని నియమించే విషయంలో గట్టిగా కృషి చేసినట్లు తెలుస్తోంది.
ముందు ముందు కాంగ్రెస్ పగ్గాలు యువ నాయకత్వానికి ఇవ్వాలని చూస్తున్న కాంగ్రెస్ అధిష్టానం, రేవంత్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకునేలా కనిపించడం లేదు.
అందుకే ఆయనకు అండగా ఉన్నాము అనే సంకేతాలు ఇచ్చేందుకు ప్రయత్నించడంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అధిష్టానం తీరుపై గుర్రుగా ఉన్నారు.హై కమాండ్ కూడా రేవంత్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ సీనియర్లు ఆయనకు అండగా నిలబడేందుకు ముందుకు రాకపోవడంతో వారిపైన ఆగ్రహంగా ఉన్నట్లు ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది.