దేశవ్యాప్తంగా అధిక మాంద్యం తీవ్ర స్థాయిలో ఉండడంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పొదుపు మంత్రం పాటిస్తూ వీలైనంతగా ఖర్చును తగ్గించుకునే పనిలో పడ్డాయి.అయితే విభజన కష్టాలతో పాటు ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో ఉన్న ఏపీ మాత్రం ఆర్ధిక భారమైనా రోజుకొక కొత్త పథకంతో ముందుకు వెళ్తున్నట్టే కనిపిస్తోంది.
కొత్తగా ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్ వెనక ముందు చూసుకోకుండా సరికొత్త పథకాలు ప్రవేశపెడుతూ ముందుకు వెళ్తున్నారు.

ఇప్పటివరకు ఏ సీఎం చేయలేనంత స్థాయిలో నాలుగు నెలల్లోనే ఎన్నో కొత్త పథకాలు ప్రారంభించి సరికొత్త రికార్డు సృష్టించాడు జగన్.అసలు ఇన్ని పథకాలు, కొత్త కొత్త ఉద్యోగాల కల్పనకు జగన్ ప్రభుత్వం నడుంబిగించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.వాస్తవానికి ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి ఆందోళకరంగానే ఉంది.

ఒక పక్క కొత్త కొత్త పధకాలను అమలు చేస్తూనే రాష్ట్ర ఆర్ధిక పురోభివృద్ధికి జగన్ ప్రత్యేక దృష్టి పెట్టాడు.ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా జగన్ తన పాదయాత్ర సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని తొలినాళ్ళ నుంచే అమలుచేయడం మొదలుపెట్టాడు.రూ.వెయ్యి పెన్షన్ ను రూ.2250 కు పెంచాడు.సంవత్సరం ముందే వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాడు.
మొట్టమొదటి సారిగా రైతులకు ఇన్సూరెన్స్ బీమా వారు కట్టాల్సిన భాగం కూడా ప్రభుత్వమే కడుతుందని చెబుతున్నారు.ఒక పక్క ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూ మరో పక్క సంక్షేమ పథకాలు అందిస్తూ ఇంకోపక్క రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు జగన్ చూస్తున్నారు.

విభజన సమయంలోనే లోటు బడ్జెట్‌లో ఉన్న నవ్యాంధ్ర అప్పుల్లో కూడా రికార్డు సృష్టిస్తోంది.పెద్ద ఎత్తున అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌ను పాలనా అనుభవం లేని వైసీపీ అధినేత ఎలా ముందుకు తీసుకు వెళ్తారనేది ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న.ఏపీ ఆర్థిక లోటు అధిగమించి పరిపాలనాపరంగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగాలంటే కేంద్రం సహకారం కూడా అవసరం.అలాగే, నిన్నటి దాకా కలిసి ఉన్న తెలంగాణతో పరస్పర సహకారంతో ముందుకు సాగాల్సి ఉంది.
అందుకే జగన్ హైదరాబాదులో కేసీఆర్‌తో, ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీతో సహా అందరిని మచ్చిక చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.ఇదే సమయంలో కేంద్ర అధికార పార్టీ నాయకుల నుంచి విమర్శలు వస్తున్నా జగన్ ఎక్కడా తొందరపడకుండా తన పని ఏదో తనదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.