దేశంలో కులం నిర్మూలన జరగాలి: స్కైలాబ్ బాబు

నల్లగొండ జిల్లా:దేశంలోని నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో నిమ్నజాతులను అణిచివేయుటకు ఆయుధంగా ఉన్న మనుధర్మ శాస్త్రాన్ని పాలకులు అనధికార రాజ్యాంగంగా చెలామణి చేస్తున్నారని,అందుకే 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో కుల సమస్య సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తుందని, దేశంలో కుల నిర్మూలన జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపెట్ల స్కైలాబ్ బాబు( Skylab Babu ) అన్నారు.

నల్లగొండ జిల్లా ( Nalgonda District )కేంద్రంలోని ఎంవిఎన్ ట్రస్ట్ భవనంలో కెవిపిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 26,27 తేదీలలో జరిగే జిల్లా స్థాయి సామాజిక శిక్షణా తరగతులకు ఆయన ముఖ్యాతిథిగా హాజరై ప్రారంభోపన్యాసం చేశారు.

ఈ దేశంలో 6486 కులాలు 28 వేల ఉపకులాలు ఉన్నాయని, తరతరాలుగా మనస్మృతి, మనుధర్మ శాస్త్రం ఆధారంగా మనిషిని మనిషిగా చూసే పరిస్థితి లేదన్నారు.కులం పేరుతో దాడులు,దౌర్జన్యాలు పెరిగిపోయాయని,ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి భారత రాజ్యాంగాన్ని తొలగిస్తామని,మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొస్తామని చెబుతూ దళిత,గిరిజన ప్రజలపైన దాడులు, హత్యలు,అత్యాచారాలుచేస్తున్నారని,దాడులు చేసిన వాళ్లను దండలేసి ఊరేగింపులు చేయడమంటే ఎంత కులోన్మాద భావజాలమో అర్థం చేసుకోవాలని, దీనికంతటికీ ఆర్ఎస్ఎస్ మూలాలే కారణమన్నారు.

నేడు విద్య,వైద్యం పేదలకు అందడం లేదని, సంక్షేమ రంగాలపైన బడ్జెట్ కేటాయింపులు చేయడం లేదని విమర్శించారు.డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగ ఫలాలను ప్రతి పౌరుడు అందుకునే నిజమైన రోజు రావాలంటే దేశంలో కుల వ్యవస్థ నిర్మూలించబడాలన్నారు.

ఈ సందర్భంగా సుభాష్ విగ్రహం దగ్గర కెవిపిఎస్ జెండాను ఆయన ఆవిష్కరించారు.ఈ క్లాసులకు ప్రిన్సిపాల్ గా కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను వ్యవహరించగా రాష్ట్ర కమిటీ సభ్యులు పరుశరాములు,జిల్లా సహాయ కార్యదర్శి బొట్టు శివకుమార్,బొల్లు రవీందర్,పెరికే విజయకుమార్,ఒంటెపాక కృష్ణ,జిల్లా కమిటీ సభ్యులు దంతాల నాగార్జున,మల్లయ్య,లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
గ్యాంగ్ రేప్ చేస్తే మరణశిక్ష...?

Latest Nalgonda News