రాజకీయాలకు, రాజకీయ నాయకులకు వ్యూహం అనేది చాలా ముఖ్యం.ఆ వ్యూహం ప్రకారమే ప్రత్యర్థులను రాజకీయంగా దెబ్బకొడితేనే పై మెట్టు ఎక్కగలరు.
ఏపీలో 151 సీట్లతో వైసీపీ బలమైన పార్టీగా ఉంది.శాసనసభలో తిరుగులేని మెజారిటీ ఉంది.
అలాగే, రాజకీయ ప్రత్యర్థులను చిత్తు చేసే విధంగా వ్యూహాలు పన్నుతోంది.బలమైన టీడీపీ ని నామ రూపాలు లేకుండా చేయడమే పనిగా పెట్టుకుని ముందుకు వెళ్తోంది.
పెద్ద ఎత్తున నాయకులను పార్టీలో చేర్చుకుంటూ, టిడిపికి గట్టి దెబ్బలు తగిలేలా చేస్తోంది.ఇదంతా ఇలా ఉంటే, శాసనమండలిలో మాత్రం వైసిపి ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
అక్కడ వైసీపీ కంటే తెలుగుదేశం పార్టీ బలం ఎక్కువగా ఉండడంతో, శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లు మండలిలో టిడిపి అడ్డుకుంటూ అధికారపార్టీ దూకుడుకు బ్రేక్ లు వేస్తోంది.
ఈ వ్యవహారాలు చికాకు పెట్టబట్టే, శాసనసభలో మండలిని రద్దు చేస్తూ, వైసీపీ ప్రభుత్వం తీర్మానం చేసింది.
ప్రస్తుతం ఆ వ్యవహారం కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది.అప్పట్లో పార్లమెంటు సమావేశాలు జరిగే అవకాశం లేకపోవడం, మండలిని రద్దు చేస్తూ బిజెపి ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం లేకపోవడంతో ఆలోచనలో పడ్డ జగన్, ఒకవేళ మండలి రద్దు కాకపోయినా, వైసీపీ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా, టిడిపి ఎమ్మెల్సీ లను వైసీపీలోకి చేర్చుకుని మండలిలో బలం పెంచుకునే టిడిపికి గట్టి ఝలక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు రాజధానులు బిల్లు, వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లు విషయంలో అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని మండలిలో టిడిపి అడ్డుకుంది.ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మండలిలో టిడిపి బలం తగ్గించాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది.
ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న డొక్కా మాణిక్యవరప్రసాద్ ఎమ్యెల్సీ పదవికి పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.వెంటనే ఆయన రాజీనామా చేసిన స్థానం నుంచి వైసీపీ తరఫున ఆయనను మళ్ళీ ఎమ్మెల్సీ ని చేశారు.
డొక్కా మాణిక్య వరప్రసాద్ ఏ సీటు అయితే వదులుకుని వైసీపీలో చేరారో, అదే సేతు నుంచి ఆయనకు మళ్లీ అవకాశం ఇచ్చారు.

మిగిలిన టిడిపి ఎమ్యెల్సీలను కూడా అదే విధంగా పార్టీలో చేర్చుకుని వారికి మళ్ళీ అదే పదవి కట్టబెడితే, అన్యాయంగా తమ ఎమ్మెల్సీలను వైసీపీలో చేరుతున్నారనే విమర్శ నుంచి అధికార పార్టీ తప్పించుకోవచ్చనే అభిప్రాయంలో ఉన్నట్లుగా కనిపిస్తోంది.ఇదే కనుక జరిగితే, తెలుగుదేశం పార్టీ మరింతగా దెబ్బతినడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.