దేశంలోని ఐదవ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ యస్ బ్యాంక్ కార్యకలాపాలను భారత ప్రభుత్వం గురువారం తన ఆధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే.ఇదే సమయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ రంగంలోకి దిగి యస్ బ్యాంక్ బోర్డును రద్దు చేయడంతో పాటు ఖాతాదారులు రూ.50 వేలకు మించి విత్ డ్రా చేయరాదని ఆదేశాలు జారీ చేసింది.దీంతో భారత కార్పోరేట్ ప్రపంచంతో పాటు ఖాతాదారులు ఉలిక్కిపడ్డారు.
యస్ బ్యాంక్ సంక్షోభం ఎప్పటి నుంచో జరుగుతున్నప్పటికీ కోలుకుంటుందని అంతా భావించారు.కానీ ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు.ఆర్‌బీఐ నుంచి గురువారం మారటోరియానికి సంబంధించిన ఉత్తర్వులు బయటకు వచ్చిన వెంటనే భారతదేశంలోని యస్ బ్యాంక్ ఏటీఏంలు, బ్రాంచ్‌లు ఖాతాదారులతో కిటకిటలాడిపోయాయి.షేర్ ధర సైతం 83 శాతం పడిపోవడంతో మదుపర్లలోనూ ఆందోళన నెలకొంది.
అటు ఎన్ఆర్ఐ కస్టమర్లలోనూ ఇదే భయాలు నెలకొన్నాయి.యూఏఈ, గల్ఫ్‌లో యస్ బ్యాంక్‌లో డిపాజిట్ చేసిన ఎన్నారైలను ఈ వార్తలు మరింత కలవరపాటుకు గురిచేస్తున్నాయి.అయితే రిజర్వ్ బ్యాంక్ పరిమితులు స్వల్పకాలానికే ఉంటాయని తాము ఎన్నారైలు సహా అన్ని వర్గాల ఖాతాదారులకు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని యస్ బ్యాంక్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సాయంతో భారత ప్రభుత్వం నేరుగా యస్ బ్యాంక్‌ను చక్కదిద్దేందుకు రంగంలోకి దిగడం వల్ల ఖాతాదారుల సొమ్ముకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.

అన్ని డిపాజిట్లు సురక్షితంగానే ఉన్నాయని, బ్యాంక్ ఆపరేషన్లు సాధారణ స్థితికి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.మరోవైపు ఖాతాదారుల భయాందోళనల నేపథ్యంలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు.బ్యాంకులోని ప్రతీ ఖాతాదారుడి డబ్బు సురక్షితంగా ఉందని , ఎవరూ ఆందోళన చెందొద్దని భరోసా నింపే ప్రయత్నం చేశారు.కస్టమర్లు, బ్యాంక్, భారత ఆర్ధిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటామని ఆర్ధిక మంత్రి స్పష్టం చేశారు.ప్రస్తుతం ఖాతారులు రూ.50 వేలు విత్ డ్రా చేసుకునేలా ఏర్పాట్లు చేయడమే తమ ముందున్న తొలి ప్రాధాన్యత అన్నారు.
యస్ బ్యాంక్ అబుదాబీలో రిప్రజంటేటివ్ ఆఫీసును ఏర్పాటు చేసింది.అలాగే న్యూయార్క్, అమెరికా, షాంఘై, చైనాలోనూ రిప్రజంటేటివ్ కార్యాలయాలను నెలకొల్పడంతో పాటు సింగపూర్, లండన్, యూకే, దుబాయ్‌లో బ్రాంచ్‌లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.