టీడీపీ పై కేంద్ర అధికార పార్టీ బిజెపి కప్పదాటు వ్యవహారం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.టీడీపీ అంతులేని అవినీతికి పాలపడిందని దానికి తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని మీడియా సమావేశాలు పెట్టి మరీ చెప్తున్న బిజెపి నాయకులు అంతకు మించి ముందుకు మాత్రం వెళ్లలేకపోతున్నారు.
ప్రతిపాదకంలోనూ టీడీపీ అవినీతికి పాల్పడిందని, దీనిపై విచారణ చేయాలని చెప్తున్న బీజేపీ పెద్దలు ఆ విచారణ ఏదో వారే వేసేస్తే నిజం ఏమిటో తేలిపోతుంది కదా ఈ ఉత్తుత్తి బెదిరింపులు ఎందుకు అని టీడీపీ ఎదురు కౌంటర్ వేస్తోంది.టీడీపీ చేస్తున్న వాదనలో కూడా నిజమే ఉంది కదా విచారణ సంస్థలు అన్ని కేంద్రం పరిధిలోనే ఉన్నాయి కదా అదేదో జరిపించేస్తే పనిలో పనిగా బీజేపీ కక్ష కూడా తీరిపోతుంది కదా !

చంద్రబాబు అవినీతికి ఆధారాలు ఇవిగో అంటూ కొన్ని కాగితాలను చూపిస్తారు.అయితే, విచారణ మాత్రం జరగటం లేదు.ఇక్కడే బిజెపి నేతల ఆరోపణలపై అందరిలోనూ అనుమానాలు వస్తున్నాయి.తాజాగా బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు మాట్లాడుతూ, అధికారుల వ్యక్తిగత ఖాతాల్లో చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ.51, 450 కోట్లు ఉంచిందని ఆరోపించారు.యూపిఏ హయాంలో జరిగిన 2 జి స్పెక్ట్రమ్ కుంభకోణం కన్నా ఈ అవినీతి చాలా పెద్దదంటూ తీవ్రంగా మండిపడ్డారు.
పోలవరం, పట్టిసీమల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ప్రతీ రోజూ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు బీజేపీ నాయకులు .పట్టిసీమలో రూ.370 కోట్ల అవినీతి జరిగిందని స్వయంగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తేల్చిందని బిజెపి ఎంఎల్ఏ విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలోనే ఆరోపించారు.వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని స్వయంగా కాగ్ చెప్పినా కేంద్రం ఎందుకు ఇప్పటి వరకూ మాట్లాడటం లేదు ? కాగ్ నివేదికను ఆధారంగా చేసుకుని విచారణ జరిపించవచ్చు కదా ? అన్న ప్రశ్నకు బిజెపి నేతల నుండి సమాధానం రావడంలేదు.

బిజెపి నేతలు చేస్తున్న ఆరోపణల ప్రకారం అవినీతి జరిగినట్లు చెబుతున్న అన్ని దాదాపు కేంద్ర పథకాలు, కేంద్రం ఇస్తున్న నిధులే.కేంద్ర పథకాల్లో అవినీతి జరుగుతున్నదని తెలిసిన తర్వాత విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వానికి ఉంది కానీ అవేమి చేయడంలేదు.జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే టిడిపి బిజెపి ఏమైనా కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయా అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి.
మోదీపై చంద్రబాబు సవాళ్ళు విసరటం, అదే సమయంలో చంద్రబాబు అవినీతిపై బిజెపి నేతలు కూడా ఆరోపణలు, విమర్శలు సంధిస్తున్నారు.ఇరువైపుల నుండి ఆరోపణలు, విమర్శలు మీడియాకు మాత్రమే పరిమితమవుతున్నాయి.
అంతకుమించి ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు.