ముఖ్యమంత్రి గారూ మునుగోడు కాలేజీలు ఎటుపాయే?

నల్లగొండ జిల్లా:ఎమ్మెల్యే గారూ ఎన్నికల వాగ్దానం గుర్తులేదా?మునుగోడులో ఇంటర్,డిగ్రీ కళాశాల ఏర్పాటు ఉత్త ముచ్చటేనా?మునుగోడు ప్రజలు ఓట్లప్పుడే యాదికుంటరా?ఏరు దాటాక తెప్ప తగలేసినట్లేనా మీ హామీలు.

ఈసారి మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఓట్లకొస్తరు!-పెండెం ధనుంజయ్ నేత,బీఎస్పీ నాయకులు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలుకు నోచుకోవని చెప్పడానికి మునుగోడు నియోజకవర్గమే సజీవ సాక్ష్యమని బీఎస్పీ నాయకులు పెండెం ధనుంజయ్ నేత ధ్వజమెత్తారు.శుక్రవారం మునుగోడు మండల కేంద్రంలో ప్రభుత్వ ఇంటర్,డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఇండిపెండెంట్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (ఐఎస్ఓ) ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షకు ఆయన ముఖ్యాతిథిగా హాజరై సంఘీభావం ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు మండల కేంద్రం, పరిసర ప్రాంతాల నుండి పై చదువుల కోసం విద్యార్థిని,విద్యార్దులు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.సరైన రవాణా సౌకర్యాలు లేక విద్యార్థులు,తల్లిదండ్రులు నానా అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఎన్నికల ప్రచారంలో ఊకదంపుడు ఉపన్యాసాలతో ఉద్దెర హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకొని గెలిచి హామీలను విస్మరించడం పరిపాటిగా మారిందని దుయ్యబట్టారు.స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడులో త్వరలోనే ఇంటర్,డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఎనిమిదేళ్లు అయినా అతీగతి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

ఇక మునుగోడు ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గ ప్రజలను ఎప్పుడో మరిచిపోయారని విమర్శించారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యా వ్యవస్థను దారుణంగా భ్రష్టు పట్టించాయని అన్నారు.

ఐఎస్ఓ విద్యార్థి సంఘం చేపట్టిన దీక్షకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.ఈ సందర్భంగా దీక్షా శిబిరం వద్దకు వచ్చిన స్థానిక తహశీల్దార్ కు షరతులతో కూడిన వినతిపత్రం అందజేసి,అనంతరం విద్యార్థి సంఘం చేపట్టిన దీక్షను విరమింప జేశారు.

ఈ కార్యక్రమంలో ఐఎస్ఓ విద్యార్థి సంఘం నాయకులు,మునుగోడు యువకులు,బీఎస్పీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

చైతన్య శోభిత విషయంలో వేణు స్వామికి బిగ్ షాక్.. చర్యలు తప్పవా?
Advertisement

Latest Nalgonda News