తెలుగుదేశం పార్టీలో ఉండగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హవాకు తిరుగు ఉండేది కాదు.వంశీ తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందారు.
విజయవాడ నుంచి ఒకసారి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత గన్నవరం నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనాన్ని సైతం తట్టుకొని వరుసగా రెండోసారి విజయం సాధించిన వంశీ ఆ తర్వాత టిడిపికి దూరమై వైసిపి సానుభూతిపరులుగా మారారు.
వంశీ వైసీపీ అయినప్పటి నుంచి ఆ పార్టీలో తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.వైసీపీలో రెండు ఎన్నికల్లోనూ వంశీకి ప్రత్యర్ధులుగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్ర రావు ఇద్దరు వంశీ వైసీపీ ఎంట్రీని స్వాగతించడం లేదు.
టీడీపీలో ఉండగా తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర స్థాయిలో యూత్‌లో మంచి గుర్తింపు ఉన్న వంశీ ఇప్పుడు వైసీపీలో నియోజకవర్గంలోనే పట్టు కోసం నానా పాట్లు పడుతున్న పరిస్థితి.ఇప్పుడు మరో జంపింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్‌ది అదే పరిస్థితి.
టిడిపిలో నాలుగు సార్లు నగర పార్టీ అధ్యక్షుడిగా పని చేయడంతో పాటు వైజాగ్ టిడిపిలో ఎంతో క్రియాశీలకంగా ఉన్న వాసుపల్లి గణేష్… విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా కూడా విజయం సాధించారు.ఇప్పుడు వైసీపీ సానుభూతి పరుడు అయ్యాక గణేష్ ఓ సాధారణ నాయకుడిగా మాత్రమే ఉన్నారు.
ఇక ఆయనకు కూడా నియోజకవర్గంలో వైసీపీ నేతల నుంచి స్వాగత సత్కారాలు, ఆదరణ లభించడం లేదు.పైగా నియోజకవర్గంలో ఇటీవలే మృతి చెందిన ద్రోణంరాజు శ్రీనివాస్, కోలా గురువులు వర్గాలు బలంగా ఉన్నాయి.
ఈ రెండు వర్గాలు కూడా తాము పార్టీలో ఎన్నికలకు ముందు నుంచి ఉన్నామని.ఇప్పుడు వాసుపల్లి గణేష్ వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తే సహించేది లేదని అంటున్నారు.
ఏదేమైనా గన్నవరంలో వంశీ ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారో ? విశాఖలో గణేష్‌ది కూడా అదే పరిస్థితి.