తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు గన్నవరం తలనొప్పి తీవ్రంగా ఉంది.తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీ వ్యవహారం ఆ పార్టీలో కలవరం పుట్టిస్తోంది.
ఆయన రాజీనామా చేయకుండా చివరివరకు ఆపేందుకు ప్రయత్నించినా ఆ ప్రయత్నాలన్నీ విఫలం అవ్వడంతో ఇప్పుడు ఏమి చేయాలనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ ఈ రోజు అత్యవసర మీటింగ్ నిర్వహిస్తోంది.అయితే వంశీ ఇప్పుడు వైసీపీలో చేరతారా, లేక బీజేపీలోకి వెళ్తారా అనే విషయం క్లారిటీ అయితే లేదు.
కానీ ఆయన ఏదో ఒక పార్టీలో చేరడం అయితే తప్పదు.అదే జరిగితే వంశీ బాటలో మరికొంతమంది నాయకులు ప్రయాణించే అవకాశం ఉండడంతో తెలుగుదేశం పార్టీ అలెర్ట్ అవుతోంది.
ఇప్పటికే చాలామంది టీడీపీ నుంచి గెలిచిన ఎమ్యెల్యేలు ఆ పార్టీని వీడాలనే ఆలోచనలో ఉన్నారు.అయితే బీజేపీలోకి వెళ్లాలా లేక వైసీపీ లోకి వెళ్లాలా అనే విషయంలో ఎటువంటి క్లారిటీ లేకపోవడంతో వీరంతా వెనకడుగు వేస్తున్నారు.
అయితే ఇప్పుడు వంశీ తీసుకునే నిర్ణయాన్నిబట్టి ఏర్పడే రాజకీయ సమీకరణాలు అంచనా వేసి అప్పుడు తాము ఏదో ఒక క్లారిటీ తెచ్చుకోవాలనే ఆలోచనలో చాలామంది ఎమ్యెల్యేలు ఉన్నారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష వైసీపీని దెబ్బతీసేందుకు శతవిధాలా ప్రయత్నించింది.దీనిలో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టి వైసీపీ నుంచి 23 మంది తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడంతో పాటు వారిలో కొంతమందికి మంత్రి పదవులు కూడా ఇచ్చింది.ఇది అన్యాయం, అక్రమ అని వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళనలు, ఫిర్యాదులు చేసినా పెద్దగా ఫలితం కనిపించలేదు.
అయితే ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రావడంతో ప్రతిపక్ష టీడీపీ ఎమ్యెల్యేలు వైసీపీలో చేరేందుకు రాయబారాలు చేశారు.అయితే అదే తప్పు తాము చెయ్యకూడదని భావించిన వైసీపీ ఈ విషయంలో జాగ్రత్త పడింది.
ఏ నేతలైనా సరే ఉన్న పార్టీకి రాజీనామా చేస్తేనే తమ పార్టీలో చేర్చుకుంటామనే నిబంధనను వైసీపీ పెట్టింది.దీని కారణంగానే ఇప్పటి వరకు ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రమే ఆ పార్టీలో చేరారు తప్ప ఎమ్యెల్యేలు ఎవరూ రాజీనామా చేసి వైసీపీలోకి వచ్చే సాహసం చేయలేకపోయారు.

దీనికారణంగానే ఇప్పటివరకు పెద్దగా ఆందోళన చెందని టీడీపీ ఇప్పుడు గన్నవరం ఎమ్యెల్యే వల్లభనేని వంశీ కారణంగా ఆందోళన చెందుతోంది.ఈ నేపథ్యంలోనే పార్టీ కీలక నాయకులతో చంద్రబాబు అత్యవసర సమావేశం నిర్వహించబోతున్నారు.మిగతా ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఆయన కొన్ని కీలక ప్రకటనలు ఈ సందర్భంగా చేయబోతున్నట్లు తెలిసింది.అలాగే వంశీ విషయంపై చర్చించనున్నట్లు సమాచారం.వైసీపీ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల తర్వాత టీడీపీలో తొలి వికెట్ పడినట్లైంది.ఇంకా ఎన్ని వికెట్లు పడతాయో అన్న ఆందోళన తెలుగుదేశం పార్టీలో నెలకొంది.
వంశీ ఇప్పటికిప్పుడు వైసీపీలో చేరకపోయినా ఆ తరువాత అయినా వైసీపీలోకి వెళ్లడం ఖాయం.ఆయనకు ఆ పార్టీలో రాజ్యసభ సభ్యత్వం కూడా దక్కుతుంది అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో గన్నవరం లో ఉప ఎన్నిక తప్పదు అనే విషయం స్పష్టంగా అర్ధం అయిపోతోంది.
ఈ నేపథ్యంలో అన్ని విషయాలపైనా క్షుణ్ణంగా చర్చించేందుకు ఏర్పాటు చేయబోతున్న ఈ సమావేశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.