తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ విషయంలో కమలం పార్టీ కొద్ది రోజులుగా దూకుడు పెంచుతోంది.ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించాక కమలం పార్టీలో ఎక్కడా లేని కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
ఈ క్రమంలోనే నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ఉపఎన్నికకు తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఇప్పుడు కమలం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ మరింత ముమ్మరం చేసినట్టు కనిపిస్తోంది.అధికార టీఆర్ఎస్ పార్టీ కే చెందిన ఓ ఎమ్మెల్సీని తమ పార్టీలో చేర్చుకుని తెలంగాణ రాజకీయాల్లోనే పెను ప్రకంపనలు రేపేందుకు కూడా కాషాయం సిద్ధమైందన్న వార్త అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
తాజాగా టీఆర్ఎస్ ఎంఎల్సీ తేరా చిన్నపరెడ్డి కమలంవైపు చూస్తున్నట్లు సమాచారం.హైదరాబాద్ లో ఆయన బీజేపీ ముఖ్య నేతలతో రహస్యంగా భేటీ అయినట్టుగా చెపుతున్నారు.కొంత కాలంగా చిన్నపరెడ్డి సీఎం కేసీఆర్ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.ఆయనకు గత ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదు.
ఇక జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ఇతర నేతల దూకుడుతో ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయింది.దీంతో ఆయన బీజేపీలో చేరి కారుకు పెద్ద షాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

బీజేపీలో చేరేందుకు సిద్ధమైన చిన్నపరెడ్డి తనకు నాగార్జునా సాగర్ ఉప ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ ఇవ్వాలన్న కండీషన్ పెట్టారని చెపుతున్నారు.అయితే వార్తలను ఆయన ప్రస్తుతానికి ఖండించినా ఆయన్ను టీఆర్ఎస్ సంతృప్తి పరచకపోతే పార్టీ మారినా ఆశ్చర్యపోనక్కర్లేదని టాక్ ? ఇప్పటికే కాంగ్రెస్ నుండి విజయశాంతి, టీఆర్ఎస్ నుండి స్వామిగౌడ్ బీజేపీలో చేరడంతో టీఆర్ఎస్ తమ పార్టీ నుంచి ఎవ్వరూ బీజేపీలోకి వెళ్లకుండా ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది.
ఇక కొద్ది రోజుల క్రితమే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ముగ్గురు మంత్రులు టీఆర్ఎస్ నుంచి బయటకు రాబోతున్నారని వీరిలో కొందరు మా పార్టీలో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ పరోక్షంగా హింట్ ఇచ్చారు.ఈ పరిణామాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి.