ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంక్ ఇలా అన్ని బ్యాంకుల ద్వారా మెగా స్టార్ చిరంజీవి తన సేవా దృక్పథాన్ని చాటుకుంటున్నారు.ఎప్పటి నుంచో ఈ సేవా కార్యక్రమాల్లో మెగా స్టార్ ఉన్నా, కరోనా సమయంలో ఆయన భారీ వ్యయం తో జిల్లా కో వాక్సిన్ బ్యాంక్ ను ఏర్పాటు చేసి ప్రజలకు ఈ మెగా స్టార్ ఎప్పుడూ అండగా ఉంటారు అనే భరోసా ఇచ్చారు.
దీంతో చిరంజీవి పై ఒక్కసారిగా అందరికీ అంచనాలు పెరిగిపోయాయి.దీంతో మెగా స్టార్ మళ్లీ పొలిటికల్ స్టార్ అవుతారు అనే అంచనాలు అందరిలోనూ పెరిగిపోతున్నాయి.
2008లో ప్రజారాజ్యం పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 294 స్థానాల్లో పోటీ చేశారు.అయితే అప్పుడు కేవలం 18 సీట్లు మాత్రమే సంపాదించుకున్నారు.
అలాగే 70 లక్షల ఓటు బ్యాంకును సంపాదించుకోగలిగారు.
ఆ తరువాతి పరిణామాల క్రమంలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి, రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా బాధ్యతలు చిరంజీవి స్వీకరించారు.
అయితే ఆ పరిణామాలు అనేక రాజకీయ విమర్శలు చెలరేగడానికి కారణం అయ్యాయి.చిరంజీవి తన పార్టీని మంత్రి పదవి కోసం అమ్ముకున్నారు అంటూ విమర్శలు వచ్చాయి.పైన కాంగ్రెస్ లోనే చిరంజీవి ఇంకా కొనసాగుతున్నారు కానీ , యాక్టివ్ గా ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.కేవలం సినిమాలపైనే దృష్టి పెట్టారు.

ఇప్పుడు సినిమా కెరియర్ కూడా చిరంజీవికి మంచి ఊపు మీద ఉండగానే మళ్లీ సేవా కార్యక్రమాలు చేపడుతూ యాక్టివ్ అవుతుండడం, ఆయనకు గతంతో పోలిస్తే ఇప్పుడు మంచి ఇమేజ్ రావడం వంటి పరిణామాలు చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ ఇచ్చేందుకే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అయితే కాంగ్రెస్ ద్వారా కాకుండా, జనసేన పార్టీ ద్వారా ఆయన యాక్టివ్ అవుతారనే ప్రచారం ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతోంది.2024 నాటికి బలమైన పునాదులు వేసుకునే ఉద్దేశంతోనే ఇప్పుడు చిరంజీవి ఈ విధంగా సేవా కార్యక్రమాల ద్వారా రీ ఎంట్రీ ఇచ్చి, పొలిటికల్ గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో అనుమానాలు కలుగుతున్నాయి.

అయితే చిరంజీవి జనసేన లోకి వెళ్లరని కాంగ్రెస్ లోనే ఉంటూ ఆ పార్టీకి ఊపు తెచ్చే ప్రయత్నం చేస్తారని, దేశవ్యాప్తంగా బిజెపి కి వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో కాంగ్రెస్ కు జాతీయ స్థాయిలో ఆదరణ పెరుగుతోందని, దీనిని పరిగణనలోకి తీసుకుని చిరంజీవి మళ్ళీ ఇందులో యాక్టివ్ అవుతారు అనే ప్రచారం జరుగుతోంది.గతంలోనే బ్లడ్ బ్యాంక్ ,ఐ బ్యాంక్ ద్వారా తన సేవా దృక్పథాన్ని బయటపెట్టుకున్న చిరంజీవి ఇప్పుడు ఆక్సిజన్ బ్యాంకు ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ఒకవేళ ఆయన జనసేనలో యాక్టివ్ అయితే ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా ఆయనే అవుతారని బీజేపీ జనసేన పొత్తు ఉండడం, చిరంజీవి వంటి వారికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు బీజేపీ సైతం ప్రయత్నిస్తూ ఉండటం వంటి వ్యవహారాలు దీనికి సంకేతాలు గా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరి చిరు మనసులో ఏముందో మరి కొద్ది రోజులు ఆగితే గాని క్లారిటీ వచ్చేలా కనిపించడం లేదు.
.