వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ఏవిధంగా పని చేశారో.పార్టీని ఏ విధంగా అధికారంలోకి తీసుకువచ్చారో అందరికీ తెలిసిందే.
రాజకీయ వ్యూహాలు రూపొందించడంలో బాగా ఆరితేరిన, వ్యూహకర్త ఉండడం అత్యవసరమని జగన్ భావించారు.ఎన్నికలకు ముందు నుంచి ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యవహారాల ప్రకారం పని చేయడంతో అనుకున్న మేరకు వైసీపీ అధికారంలోకి రాగలిగింది.
దీంతో తెలుగుదేశం పార్టీ సైతం రాజకీయ వ్యూహకర్త అవసరాన్ని గుర్తించింది.పూర్తిగా నిరాశ నిస్పృహల్లో ఉన్న పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచేందుకు 2024 ఎన్నికల్లో కచ్చితంగా టిడిపి అధికారంలోకి వచ్చేలా చేసేందుకు రాబిన్ శర్మ అనే రాజకీయ వ్యూహకర్తను టిడిపి నియమించుకుంది.
ఆయన వ్యూహాల ప్రకారం అనేక ఆందోళనలు ప్రభుత్వంపై చేపట్టినా, అంతంత మాత్రంగానే ఉందని టిడిపి గుర్తించింది.ఆయనను నమ్ముకుంటే టిడిపి అధికారంలోకి రావడం కష్టమని భావించడం తోనే ఇప్పుడు ఆయన సేవలను పూర్తిగా టిడిపి రద్దు చేసుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
దీంతో మరో రాజకీయ వ్యూహకర్తను టిడిపి నియమించుకున్నట్టు తెలుస్తోంది.టిడిపి కొత్త వ్యూహకర్తగా సునీల్ కుమార్ కానుగోలు అనే వ్యక్తిని నియమించుకున్నట్లు సమాచారం.కర్ణాటకలోని బళ్ళారిలో సుశీల్ కుమార్ పుట్టగా, పెరిగిందంతా చెన్నై .ఆ తరువాత అమెరికాలో ఆయన చదువుకున్నారు .అమెరికా నుంచి వచ్చిన తర్వాత రాజకీయాలపై ఆసక్తి తో అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్ అనే సంస్థను ఏర్పాటు చేశారు.
కొద్ది నెలల క్రితం జరిగిన తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే స్టాలిన్ తో సునీల్ కుమార్ పని చేశారు.ఆ తరువాత స్టాలిన్ ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా నియమించడంతో సుశీల్ కుమార్ బయటకు వచ్చారు. ఇక ఉత్తర ప్రదేశ్ , గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో కొన్ని రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా ఆయన పనిచేశారు.
తెలంగాణలోని టిఆర్ఎస్ పార్టీకి వ్యూహకర్తగా ను ఆయన పనిచేశారు.ప్రస్తుతం టిడిపి తో ఆయన ఒప్పందం చేసుకుని రాజకీయ వ్యూహాలు రూపొందించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఆయన ఆధ్వర్యంలోనే 2024 ఎన్నికలను ఎదుర్కొనేందుకు టిడిపి సిద్ధమవుతున్నట్టు టిడిపి వర్గాలు పేర్కొంటున్నాయి.