ఇప్పటికీ తెలంగాణలో బిజెపి బలం పెంచుకుంటున్న తీరుతో టిఆర్ఎస్ పార్టీలో ఎక్కడలేని ఆందోళన పెరిగిపోతుంది.రాబోయే రోజుల్లో తాము అధికారం కు దూరం కావాలేమో అనే భయం ఆ పార్టీ నేతలలోనూ పెరిగిపోతూ వస్తోంది.
ఇప్పటికే పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ప్రజలలోనూ, ఉద్యోగ సంఘాలలోనూ, టిఆర్ఎస్ ప్రభుత్వం పై వ్యతిరేకత పెరిగిపోతున్న నేపథ్యంలో ఆ వ్యతిరేకతను తగ్గించుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ, అందరినీ మెప్పించే ప్రయత్నం చేస్తోంది.ఇదిలా ఉంటే ఇప్పుడు కేసీఆర్ క్యాబినెట్ లో కీలకమైన మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఈటెల రాజేందర్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయింది.
టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంట నడుస్తున్న ఈటెల రాజేందర్ కు రెండోసారి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఆయనను పక్కన పెట్టినట్లు వ్యవహరించారు.ఆయనకు గతంలో ఉన్న ప్రాధాన్యం తగ్గింది.
కేసీఆర్ తీరుపై బహిరంగంగానే ఈటెల స్పందించేవారు.ఇక ఈటెల హవా టిఆర్ఎస్ లో ముగిసింది అనుకుంటున్న సమయంలో మళ్లీ ఆకస్మాత్తుగా ఆయనకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అవకాశం కల్పించారు.
తాజాగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూర్ లో రైతు వేదిక ప్రారంభోత్సవం సందర్భంగా , ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.పంట కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తామని కెసిఆర్ చెప్పిన నిర్ణయాన్ని పరోక్షంగా ఈటెల తప్పుబట్టారు.
రైతుల మేలు కోసం కొనుగోలు కేంద్రాలు ఉండాల్సిందేనని తాను కోరుతున్నానని చెప్పిన ఈటెల ఐకేపీ సెంటర్లు ఉండాల్సిందేనని ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఉండాల్సిందే అని అన్నారు.

ఈ విషయాన్ని కెసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని, తాను మంత్రిగా ఉన్నా, ఇంకో పదవిలో ఉన్నా రైతు ఉద్యమానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు.అలాగే రైతు బంధు పథకం అమలులోని లోపాలను ఈటెల రాజేందర్ అంగీకరించారు.రైతు బంధు పథకం ఉద్దేశం మంచిదే అయినా, ఆదాయ పన్ను కట్టే వాళ్లకు, రియల్ ఎస్టేట్ భూములకు , వ్యవసాయం చేయకుండా లీజుకు ఇచ్చే భూములకు రైతుబంధు ఇవ్వద్దని రైతులు కోరుతున్నారు అనే విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకు వెళతానని అన్నారు.
ఈటెల మాటల్లో తాను మంత్రి పదవిలో ఉన్నా, ఇంకో పదవిలో ఉన్నా అంటూ మాట్లాడిన మాటల పైన ఇప్పుడు టిఆర్ఎస్ లోనూ ప్రజల్లోనూ జోరుగా చర్చ జరుగుతోంది.ఆయన ఈ రకంగా తన అసంతృప్తిని, ఆందోళనను బయటపెట్టుకున్నారా అనే విశ్లేషణలు మొదలయ్యాయి.