వెంటాడుతున్న క్యాపిటల్ బిల్డింగ్‌ దాడి, వదలని డెమొక్రాట్లు: ట్రంప్‌పై మరో దావా

అమెరికా అధ్యక్షునిగా జో బైడెన్ ఎన్నికను అధికారికంగా ధ్రువీకరించేందుకు యూఎస్ కాంగ్రెస్ జనవరి 6న క్యాపిటల్ బిల్డింగ్‌లో సమావేశమైన సంగతి తెలిసిందే.

బైడెన్ ఎన్నికను తొలి నుంచి నిరసిస్తున్న ట్రంప్ మద్ధతుదారులు ఆ రోజు క్యాపిటల్ బిల్డింగ్‌లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు.

దీనికి ట్రంపే కారణమంటూ అమెరికాలో పెద్ద దుమారం రేగింది.దీనికి శిక్షగా ఏకంగా ట్రంప్‌ను జనవరి 20కి ముందే పదవిలోంచి దించేయాలంటూ డెమొక్రాట్లు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు.

ప్రతినిధుల సభలో ఆమోదం పొందిన ఈ తీర్మానం .ట్రంప్ పదవిలోంచి దిగిపోయిన తర్వాత సెనెట్‌లో వీగిపోయింది.అయినప్పటికీ అమెరికా చరిత్రలో రెండు సార్లు అభిశంసనను ఎదుర్కొన్న అధ్యక్షునిగా ట్రంప్ అప్రతిష్టను మూట కట్టుకోవాల్సి వచ్చింది.

అయినప్పటికీ డెమొక్రాట్లు ఆయనను వదిలేలా కనిపించడం లేదు.తాజాగా అధికార పార్టీకి చెందిన ప్రతినిధుల సభ సభ్యుడు ఎరిక్ స్వాల్‌వెల్ క్యాపిటల్ భవనంపై దాడికి ట్రంప్, ఆయన కుమారుడు జూనియర్ ట్రంప్, న్యాయవాది రూడీ గియులియాని, ఇతర రిపబ్లిన్ సభ్యులు వారి మద్ధతుదారులను ప్రేరేపించారని ఆరోపిస్తూ వాషింగ్టన్‌లోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేశారు.

Advertisement

ట్రంప్ సహా ఇతర ముద్దాయిలు అబద్ధాలు చెప్పడంతో పాటు తమ వాక్చాతుర్యంతో రిపబ్లికన్ పార్టీ మద్ధతుదారులను ప్రభావితం చేశారని.ఇది అంతిమంగా క్యాపిటల్ భవనంపై దాడికి దారి తీసిందని ఎరిక్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

డెమొక్రాటిక్ పార్టీకే చెందిన బెన్నీ థాంప్సన్ ట్రంప్‌పై గత నెలలో ఇదే తరహా పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.మాజీ అధ్యక్షుడిపై కేసు పెట్టడానికి ఇద్దరూ ‘కూ క్లుక్స్‌ క్లాన్’ చట్టాన్ని పరిగణనలోనికి తీసుకోవాలని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.ఈ చట్టం ఆఫ్రికన్‌ అమెరికన్ల ఓటు హక్కులకు రక్షణ కల్పించేలా ఆ దేశ అధ్యక్షుడికి అధికారాలు కల్పిస్తూ.1871 సివిల్‌ వార్‌ సమయంలో ఏర్పడింది.జనవరి 6న క్యాపిటల్‌ బిల్డింగ్‌పై దాడిని ప్రోత్సహించడం ద్వారా మాజీ అధ్యక్షుడు ‘కూ క్లుక్స్‌ క్లాన్‌’ చట్టాన్ని ఉల్లంఘించారంటూ వీరు ఆరోపిస్తున్నారు.

ఓటమిని అంగీకరించకుండా, శాంతియుతంగా అధికార మార్పిడికి సహకరించక ట్రంప్ పూర్తి స్థాయిలో యుద్ధం చేశాడని సాల్‌వెల్ తన పిటిషన్‌లో తెలిపారు.కాగా తిరుగుబాటును ప్రేరేపించాడనే అభియోగంపై సెనేట్‌లో ట్రంప్ అభిశంసనపై విచారణను నిర్వహించిన వారిలో సాల్‌వెల్ ఒకరు.

మరోవైపు క్యాపిటల్ బిల్డింగ్‌పై దాడి ఘటనలో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు 300 మందిని అరెస్ట్ చేశారు.

అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బుజ్జితల్లి.. సాయిపల్లవి, చైతన్య ఖాతాలో రికార్డ్!
Advertisement

తాజా వార్తలు