పార్టీ నేతలను ఉద్దేశించి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.గత కొంతకాలంగా డిజిటల్ మెంబర్ షిప్ కార్యక్రమాన్ని చేపట్టిన రేవంత్ రెడ్డి ఈ విషయంలో పార్టీ శ్రేణులు అంత ఉత్సాహం చూపించకపోవడం, కొన్ని కొన్ని చోట్ల కాంగ్రెస్ సభ్యత్వ నమోదు తూతూ మంత్రంగా సాగుతుండడం వంటి వ్యవహారాలను సీరియస్ గా తీసుకున్నారు.
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లి లో జరిగిన పార్టీ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పార్టీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ సభ్యులుగా చేరిన వారికి సంక్షేమ పథకాల్లో మొదటి ప్రాధాన్యం ఇస్తామని అన్నారు.
కాంగ్రెస్ లో సభ్యులుగా చేరి వారికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, కాంగ్రెస్ లో చేరిన వారికి మాత్రమే పెన్షన్లు ఇస్తామని చెప్పారు.
అలాగే పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి రైతు రుణమాఫీ అమలు చేస్తామని, వాళ్లకి ఆరోగ్యశ్రీ పథకం అందిస్తామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ కుటుంబ పెద్దగా ఆ బాధ్యత తానే తీసుకుంటానని రేవంత్ వ్యాఖ్యానించారు.మార్చి 25వ తేదీ వరకు పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు.
పదవులను వెంటనే రద్దు చేయాలని బోసు రాజు కు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.పనిచేసిన వారికి, చేయని వారికి ఒకే రకమైన ప్రాధాన్యత ఇవ్వడం అంత మంచిది కాదు అంటూ రేవంత్ అభిప్రాయపడ్డారు.
పార్టీ కోసం కష్టపడితేనే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని, కాంగ్రెస్ జెండా ఊరికే పట్టుకోవడం కాదని, పార్టీ సభ్యత్వలు నమోదు చేయించే వారికే పదవుల్లో, ప్రాధాన్యత ఉండాలన్నారు.
తాను ఇంకా ఇరవై ఏళ్ల పాటు రాజకీయాల్లోనే ఉంటానని, పార్టీ కోసం కష్టపడిన వారి బాగోగులు తానే చూసుకుంటానని చెప్పుకొచ్చారు.కాంగ్రెస్ కార్యకర్తల కష్టం చూసి భయపడే తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ ను రాజకీయ వ్యూహకర్త గా నియమించుకున్నారన్నారు.కాంగ్రెస్ కార్యకర్తలు అంతా ఏకమై పార్టీ కోసం కష్టపడితే అధికారం సునాయాసంగా దక్కుతుందని , సోనియమ్మ రాజ్యం ఖచ్చితంగా వస్తుంది అని రేవంత్ దిశానిర్దేశం చేశారు.